ఆమెకు ఆరుగురు పోలీసుల కాపలా

1 Sep, 2017 13:56 IST|Sakshi
ఆమెకు ఆరుగురు పోలీసుల కాపలా

సాక్షి, తిరువనంతపురం: అది కేరళలోని కొట్టాయం జిల్లా, తిరుమణి వెంకటపురం (టీవీ పురం అని పిలుస్తారు) గ్రామంలోని ఓ ఇల్లు. ఇంటి వెలుపల ఎప్పుడూ ఆరుగురు సాయుధ పోలీసులు, షిప్టుల పద్ధతిలో 24 గంటలపాటు కాపలా ఉంటారు. ఆ ఇంటి పరిసరాల దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వరు. ముఖ్యంగా జర్నలిస్టులను అసలే రానివ్వరు. ఇంటినిగానీ, ఇంటి పరిసరాలనుగాని కనీసం ఫొటోలు కూడా తీయనివ్వరు. ఆ ఇంటికి సంబంధించిన బంధువులొస్తే వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వారిని తనిఖీ చేస్తారు. అలా అని అది పెద్ద రాజకీయ నాయకుడి ఇల్లు కాదు, సెలబ్రిటీ ఇల్లు అంతకన్నా కాదు. టెర్రరిస్టు ఇల్లు అసలే కాదు.

అది సీఆర్‌పీఎఫ్‌లో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయిన అశోకన్‌ మణి అనే వ్యక్తి ఇల్లు. అందులో ఆయన భార్య పొన్నమ్మ, వారి 24 ఏళ్ల కూతురు అఖిల అశోకన్‌ ఉంటున్నారు. వారి ముగ్గురి కోసం ఆ ఇంటికి అంత భద్రత ఎందుకో తెలసుకోవాలంటే కాలక్రమంలో వెనక్కి వెళ్లి రావాలి. అఖిల స్థానికంగా తన హైస్కూలు, ఇంటర్‌ చదువు ముగించుకొని తన 18వ ఏట, అంటే 2011లో ఊరు నుంచి పై చదువుల కోసం 400 కిలోమీటర్ల దూరంలోవున్న తమిళనాడులోని సేలంకు వెళ్లారు. అక్కడి శివరాజ్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజీలో ‘బ్యాచ్‌లర్స్‌ ఇన్‌ హోమియోపతిక్‌ మెడిసన్‌ అండ్‌ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్‌)లో చేరారు.

అక్కడి కళాశాల హాస్టలో ఆమెకు ఫుడ్‌ నచ్చ లేదు. చదువు మీద కూడా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, దాంతో మొదటి సంవత్సరంలో ఒకసారి, ఆఖరి సంవత్సరంలో ఒకసారి ఫెయిలయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీ. కన్నన్‌ తెలిపారు. అఖిల మొదటి సంవత్సరం పూర్తికాగానే నలుగురు క్లాస్‌మేట్స్‌తో కలసి బయట రూమ్‌ తీకున్నారు. వారిలో ఇద్దరు హిందువులు కాగా, జసీనా సహా మరో ఇద్దరు ముస్లిం యువతులు ఉన్నారు. 2015, నవంబర్‌ తన తాతగారు చనిపోవడంతో అఖిల సొంతూరు టీవీ పురంకు వచ్చారు. తాత కర్మకాండలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. అనవసర తతంగమంటూ విసుక్కున్నారు. ఎప్పుడు గుడులు చుట్టూ తిరిగే తల్లి పొన్నమ్మ వెంట ఒక్క గుడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు.

కూతురులో వస్తున్న ఈ మార్పేమిటో తల్లిదండ్రులు గ్రహించేలోగానే అఖిల చదువు కోసం సేలం వెళ్లిపోయారు. తన రూమ్‌మేట్‌ జసీనా, ఆమె చెల్లెలు ఫసీనాతో అఖిలకు మంచి స్నేహం ఏర్పడింది. 2016, జనవరి 2వ తేదీన అఖిల మల్లపురం జిల్లాలోని పెరింథాలమన్న గ్రామంలోని జసీనా, ఫసీనాల ఇంటికి వెళ్లింది. వేళకు ప్రార్థనలు చేయడం లాంటి ముస్లిం సంప్రదాయం తనకు నచ్చిందని, తాను ముస్లిం మతం స్వీకరిస్తానని స్నేహితురాళ్లకు చెప్పింది.ఈ విషయాన్ని అఖిల స్నేహితురాళ్లు వారి తండ్రి అబూబ్యాకర్‌ దష్టికి తీసుకెళ్లారు. ముందుగా చదువు పూర్తి చేసుకున్నాక మతం మారవచ్చని, అంతవరకు ఓపిక పట్టుమని అఖిలకు నచ్చ చెప్పేందుకు అబూబ్యాకర్‌ ప్రయత్నించారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆయన అఖిలను కోజికోడ్‌లోని ‘తెరబియ్యాతల్‌ ఇస్లామ్‌ స్కూల్‌ ’కు తీసుకెళ్లారు.

ఇస్లామ్‌ మతంలో చేరాలంటే ఎవరి ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా చేరుతున్నానంటూ నోటరీ నుంచి అఫిడ్‌విట్‌ తీసుకరావాలని, ఇస్లామ్‌ మతంలో 60 రోజుల కోర్సు చేసి పాసవ్వాలని సభ ప్రిన్సిపాల్‌ ఉమర్‌ ఫాయిజీ చెప్పారు. ఖురాన్‌లోని కొన్ని సురాలు (మొత్తం 114 సురాలు ఉంటాయి), అంటే కొన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులను వెంట తీసుకు రానందున సభలో ఉండి చదువుకోవడానికి ఆయన  ఒప్పుకోలేదు. బయట ఉండి కోర్సు చేయడానికి అంగీకరించారు. కేరళ ప్రభుత్వం మత మార్పిడి సర్టిఫికెట్లను గుర్తించే సంస్థల్లో ఈ సభ ఒకటి.

దాంతో ఆబూబ్యాకర్‌ను అఖిలను 2016, జనవరి 5వ తేదీన మల్లప్పురం జిల్లా, మంజేరిలోని మర్కాజుల్‌ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా అఫిడవిట్‌ లేనందున అఖిలను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇంతకుమించి తాను సహాయం చేయలేనని, సేలం వెళ్లాల్సిందిగా ఆమెను అబూబ్యాకర్‌ కోరారు. ఆమె అలాగేనని చెప్పి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈలోగా తన కూతురు సేలంలో లేదని తెలుసుకున్న అశోకన్‌ జనవరి 7వ తేదీన పెరింథాలమన్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కేసును దాఖలు చేశారు. జనవరి 14వ తేదీన కేరళ హైకోర్టుకు వెళ్లి ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఈలోగా మిస్సింగ్‌ కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు కేరళ పోలీసు చట్టంలోని 57 చట్టం కింద అబూబ్యాకర్‌ను అరెస్ట్‌ చేసి విచారించారు. రెండు రోజుల నిర్బంధం అనంతరం ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.



2016, జనవరి 19వ తేదీన అఖిల కేరళ హైకోర్టుకు హాజరై తాను ఎక్కడికి తప్పిపోలేదని, తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తాను ఇష్టపూర్వకంగానే మర్కాజుల్‌ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌లో చదువుకుంటున్నానని చెప్పారు. సేలం వెళ్లిపోతానని అబూబ్యాకర్‌కు చెప్పిన అఖిల వెళ్లిపోకుండా  అఫిడవిట్‌ తీసుకొని తిరిగి మర్కాజుల్‌ ఇదయాకు మళ్లీ వెళ్లారు. పెద్ద వాళ్ల ప్రమేయం లేకుండా తాము చేర్చుకోమని అప్పుడు కూడా ట్రస్ట్‌ మేనేజర్‌ మొహమ్మద్‌ రఫీ చెప్పారట. ఇస్లాంలో కోర్సు చేయాలన్న ఆసక్తి తనకు ఎంతో ఉందని చెప్పడంతో ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’కు అనుబంధంగా నడుస్తున్న జాతీయ మహిళా సంఘటన జాతీయ అధ్యక్షులైన సాయినాభను కలవాల్సిందిగా ఆయన సూచించారట.

ఆ సూచన మేరకు అఖిల ఆమెను కలసుకొని తన కథంతా చెప్పి ఆమెతో ఉండిపోయారు. తండ్రి కోర్టులో అఫిడవిట్‌ వేసిన విషయం తెలుసుకొని అఖిల సాయినాభను తీసుకొని హైకోర్టుకు వచ్చారు. కేరళలో అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలు సాయినాభ హైకోర్టు అఖిల తండ్రి అశోకన్‌ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌ను జనవరి 25వ తేదీన కొట్టివేయడంతో అఖిల తిరిగి సాయినాభతో కలసి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ శరాణి ట్రస్ట్‌ షరతుపై సేలం వెళ్లి  హోమియోపతి ఫైనల్‌ ఇయర్‌లో మిగిలిపోయిన సబ్జెక్టులను పూర్తి చేసి, తిరిగి ట్రస్ట్‌కు చేరుకొని అక్కడి 50 రోజుల ఇస్లాం కోర్సు చేసి పాసయ్యారు. తన పేరును హిదయాగా మార్చుకుని ఇస్లాం సర్టిఫికెట్‌ తీసుకున్నారు.

అనంతరం ముస్లింల పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ ‘వే టూ నిఖా డాట్‌ కామ్‌’లో తన పేరును నమోదు చేసుకున్నారు. 20 మంది ముస్లిం యువకుల నుంచి అమెకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే హదియా  హిందూ మతాన్ని మార్చుకోవడం వల్ల మున్ముందు గొడవలు రావచ్చనే భయంతో పెళ్లి చేసుకోవడానికి వారెవరూ ముందుకు రాలేదు. ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’కు చెందిన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన షాఫిన్‌ జహాన్‌ను పెళ్లి చేసుకునేందుకు హదియాగా మారిన అఖిల నిర్ణయించుకున్నారు. ఈలోగా తన కూతురును సిరియాలో పోరాడేందుకు ఐఎస్‌ టెర్రరిస్టులు తీసుకెళ్లారని ఆరోపిస్తూ అఖిల తండ్రి అశోకన్‌ మరోసారి కేరళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

హదియా మళ్లీ కోర్టుకు హాజరై తాను సిరియా వెళ్లేందుకు తన వద్ద పాస్‌పోర్టు కూడా లేదని, తాను ఎలా వెళతానని కోర్టుకు నివేదించారు. తాను ఇష్టపూర్వకంగా సాయినాభ దగ్గరే ఉంటున్నానని  చెప్పారు. ఈసారి కోర్టు సాయినాభతో ఉండేందుకు అనుమతించలేదు. తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా సూచించింది. అందుకు హదీనా అంగీకరించకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని లేడీస్‌ హాస్టల్‌ ఉంచి నిఘా ఉంచాల్సిందిగా కేరళ పోలీసులను కోర్టు ఆదేశించింది. తాను ఏ నేరం చేయనప్పటికీ తనను బలవంతంగా హాస్టల్‌లో ఉంచి, పోలీసు నిఘా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆమె సెప్టెంబర్‌ 29న హైకోర్టుకు లేఖ రాశారు.

తిరిగి సాయినాభతో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హదియా హోమియోపతి సబ్జెక్టులన్నీ పాసైనప్పటికీ హౌజ్‌సర్జన్‌ పూర్తి చేయలేదు. అందుకు తన తండ్రి తీసుకెళ్లిన తన సర్టిఫెకెట్లన్నింటినీ ఇప్పించాల్సిందిగా హదియా కోరుతూ 2016, అక్టోబర్‌ 24వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు అందుకున్న ఆమె సేలం వెళ్లి హౌజ్‌ సర్జన్‌లో చేరారు. 2016, డిసెంబర్‌ 19వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం షాఫిన్‌ను నిఖా చేసుకున్నారు.

ఆ పెళ్లిని కూడా తండ్రి వ్యతిరేకించడంతో డిసెంబర్‌ 21వ తేదీన హదియా తన భర్తతో కలసి కోర్టుకు హాజరయ్యారు. వారి పెళ్లి పట్ల హైకోర్టు కూడా అసంతప్తి వ్యక్తం చేసింది. హదియా కోర్టు వ్యవహారంతో తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించాకే తనకు పరిచయం అయ్యారని, పెళ్లికి ఆమె తండ్రిని కూడా ఆహ్వానించానని పెళ్లి కుమారుడు కోర్టుకు తెలిపారు. పెళ్లి కుమారుడి పూర్వపరాలను విచారించాల్సిందిగా స్థానిక డీజీపీని ఆదేశించిన కోర్టు హదియాను తిరిగి వుమెన్‌ హాస్టల్‌కు పంపించింది.



షాఫిన్‌పై చదువుకునే రోజుల్లో ఓ క్రిమినల్‌ కేసు దాఖలైందని, గత అక్టోబర్‌లో ఐఎస్‌ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన మాన్సి బురాఖితో పరిచయం ఉందని పోలీసులు నివేదిక ఇవ్వడంతో హైకోర్టు గత మే నెలలో షాఫిన్‌తో హదియాకు జరిగిన పెళ్లిని రద్దు చేసింది. అది కాలేజీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన సాధారణ ఘర్షణ కేసని, ఇక బురాఖితో తనకు ఎలాంటి సంబంధం లేదని షాఫిన్‌ వాదించినా హైకోర్టు పట్టించుకోలేదు. హదియాను స్వగ్రామమైన టీవీ పురంలో తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా ఆదేశిస్తూ పోలీసుల కాపలాను ఏర్పాటు చేసింది. హైకోర్టు తమ పెళ్లిని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆగస్టు 16వ తేదీన షాఫిన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ’ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో హదియాగా మారిన అఖిల ఇంటి ముందు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కేసును కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు ‘లవ్‌ జిహాదీ’గా పేర్కొన్నాయి.హదియా మాత్రం తీవ్రవాదులతోగానీ, వారి సంస్థలతోగానీ తనకుగానీ, తన భర్తకుగాని ఎలాంటి సంబంధాలు లేవని చెబుతూ వస్తున్నారు. ఆమె తన చదువు, ఇస్లాం కోర్సు, మత మార్పిడి, పెళ్లి అన్నింటికి సంబంధించిన రుజువులను భద్రంగా దాచుకున్నారు. హదియాను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఎంత ప్రయత్నించినా కోర్టు నుంచిగానీ, పోలీసుల నుంచిగానీ అనుమతి లభించలేదు.

శబరిమల సీనియర్‌ పూజారి మనవడు, సామాజిక కార్యకర్త రాహుల్‌ ఈశ్వర్‌ మాత్రం బుధవారం నాడు హదియాను, ఆమె తల్లి పొన్నమ్మను ఇంట్లోకి వెళ్లి కలసుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు ఇళ్లంత నిశబ్దంగా ఉంది. తల్లీ కూతుళ్లు ఎవరూ కూడా  మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోవడం లేదని తల్లి చెప్పగా, ముఖంపై నుంచి దుప్పట్టా వేసుకున్న హదియా తనను నమాజు కూడా చేసుకోనివ్వకుండా హింసిస్తున్నారని ఆరోపించింది. ‘ఇంకెంతకాలం నాకీ నిర్బంధం’ అన్న హదియా అడిగిన ప్రశ్నకు రాహుల్‌ వద్ద సమాధానం లేకపోవడంతో మౌనంగా బయటకు వచ్చారు.

మరిన్ని వార్తలు