వాళ్లిద్దరినీ విడదీయడం కుదరకపోవడం వల్లే.. ఇలా!

4 Jan, 2019 11:46 IST|Sakshi
రాహుల్‌తో షీనాబోరా

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా 27వ సాక్షిని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు సదరు సాక్షి పేర్కొన్నారు.

ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న ఇంద్రాణి స్నేహితుడు, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగి అయిన ప్రితుల్‌ సంఘ్వీ విచారణలో భాగంగా పలు విషయాలు కోర్టుకు వెల్లడించారు.‘ 2002 నుంచి నాకు ఇంద్రాణి పరిచయం. నా ఇంట్లో తను అద్దెకు ఉండేది. ఆ తర్వాత ఆమె కంపెనీలో మేనేజర్‌గా జాయిన్‌ అయ్యాను. ఇంద్రాణి, ఆమె భర్త పీటర్‌ ముఖర్జీ ఇచ్చే పార్టీలకు తరచుగా హాజరయ్యేవాడిని. ఆ సమయంలో షీనా కూడా ఒకటి రెండుసార్లు అక్కడికి వచ్చింది. ఇంద్రాణి.. షీనాను తన చెల్లిగా మా అందరికీ పరిచయం చేసింది. అయితే పీటర్‌ కొడుకు రాహుల్‌తో షీనా రిలేషన్‌షిప్‌లో ఉండటం ఆ దంపతులిద్దరికీ నచ్చలేదు. 2008 నుంచి వాళ్లను విడదీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఓరోజు.. వాళ్లిద్దరు ఉండే ఏరియాకు నన్ను కూడా రమ్మన్నారు. అయితే నాకు ఆరోజు వేరే పని ఉండటంతో రాలేనని చెప్పాను. ఆ తర్వాత ఇంద్రాణి.. షీనాను తనతో పాటు తీసుకువెళ్లగా, రాహుల్‌ని.. పీటర్‌ తీసుకువెళ్లాడు. ఇంతలోనే షీనా కనిపించడం లేదనే వార్త బయటికి వచ్చింది’ అని ప్రితుల్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షీనాను హత్య చేయడం వెనుక ఇంద్రాణికి ఉన్న ఉద్దేశమేమిటో నిరూపించేందుకు సీబీఐకి బలమైన సాక్ష్యం లభించినట్లైంది. (విడిపోనున్న ఇంద్రాణి దంపతులు)


ఇంద్రాణి- పీటర్‌ ముఖర్జీ

షీనా బోరా హత్య కేసు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్‌ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా  హతమార్చేందుకు జరిగిన  కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్‌ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు