ఉల్లిపాయలు వేయొద్దని చెప్పాను: బంగ్లా ప్రధాని

4 Oct, 2019 19:49 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉల్లి ఎగుమతులపై భారత్‌ నిషేధం ఎందుకు విధించిందో అర్థం కావడం లేదని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. భారత్‌ నిర్ణయంతో తనకు, తమ దేశానికి పెద్ద సమస్య పడి వచ్చిందని సరాదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా- బంగ్లాదేశ్‌ బిజినెస్‌ సదస్సుకు శుక్రవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ హసీనా మాట్లాడుతూ..‘ ఉల్లిగడ్డలు పొందడం ప్రస్తుతం మాకు పెద్ద సమస్యగా పరిణమించింది. అసలు మీరెందుకు ఉల్లి సరఫరాను నిలిపివేశారో అర్థం కావడం లేదు. కొరత ఉన్న కారణంగా ఉల్లిపాయలు లేకుండా లేకుండానే వంట చేయాలని పనిమనిషికి చెప్పాను అని పేర్కొన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.

కాగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో.. ఉల్లి ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబరు 29న ప్రకటన చేసిన కేంద్రం.. తక్షణమే నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రపంచ కూరగాయల మార్కెట్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారత్‌ నిర్ణయంతో బంగ్లాదేశ్‌కు పెద్ద దెబ్బ పడింది. ఆ దేశంలో క్వింటాళ్‌ ఉల్లి ధర పది వేల రూపాయల(బంగ్లా కరెన్సీలో)కు చేరుకుంది. 

>
మరిన్ని వార్తలు