హోం శాఖలోకి అస్సాం రైఫిల్స్‌ వద్దు

30 Sep, 2019 05:17 IST|Sakshi

చైనా సరిహద్దుల్లో గస్తీపై ప్రభావం పడుతుందని సైన్యం అభ్యంతరం

న్యూఢిల్లీ: అస్సాం రైఫిల్స్‌ బలగాలను హోం శాఖ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం అమలైతే అత్యంత సున్నితమైన చైనా సరిహద్దుల్లో గస్తీపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని రక్షణ శాఖను కోరింది. అస్సాం రైఫిల్స్‌ను ఇండో–టిబెటన్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ)లో విలీనం చేసి మొత్తం తన నియంత్రణ కిందికి తెచ్చుకోవాలన్న హోం శాఖ ప్రతిపాదనను ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ త్వరలో చర్చించనుంది. అస్సాం రైఫిల్స్‌ను పూర్తిగా హోం శాఖ ఆధీనంలోకి తెస్తే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నిఘాపై తీవ్ర ప్రభావం పడుతుందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు తెలిపారు. నాగాలతో చర్చలు, అసోంలో ఎన్నార్సీ అమలు సమస్య, భారత్‌తో సరిహద్దుల వెంబడి చైనా పెద్ద ఎత్తున మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న వంటి వాటి నేపథ్యంలో ఈ చర్య ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈ విషయాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరవేశామని తెలిపారు. 185 ఏళ్ల చరిత్ర కలిగిన అస్సాం రైఫిల్స్‌లోని 46 బెటాలియన్లలోని 55 వేల మంది సైనికులు 1,640 కిలోమీటర్ల మయన్మార్‌ సరిహద్దుల్లో కాపలాతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌–చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ బలగాలపై హోం శాఖకు పరిపాలన పరమైన నియంత్రణ, సైన్యం కార్యాచరణ నియంత్రణ కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తలు