-

‘ఘర్షణలు రెచ్చగొట్టేవారిని వదిలిపెట్టం’

4 Jun, 2018 10:05 IST|Sakshi
మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా (ఫైల్‌ ఫోటో)

షిల్లాంగ్‌: మేఘాలయలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలను కొందరు కావాలనే ప్రోత్సహిస్తున్నారని  ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా ఆరోపించారు. గురువారం షిల్లాంగ్‌లో ఖాసీ పిల్లాడిపై ఒక సిక్కూ మహిళ దాడి చేయడంతో ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే. పంజాబ్‌ వాసులు నివాసముంటున్న మావ్‌లాంగ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, ఘర్షణలను అదుపు చేయడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

నిరసనకారులకు కొంతమంది డబ్బులు, మద్యం అందిస్తున్నారని సీఎం సంగ్మా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను ప్రోత్సహిస్తున్న పంజాబీలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయలో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవడానికి తమ కేబినెట్‌ మంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పంపుతామని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు.

కమిటీ నివేదిక ఆధారంగా పంజాబ్‌ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. మేఘాలయలోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజుజు స్పందించారు. షిల్లాంగ్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయని, గురుద్వారపై ఎవరూ దాడి చేయలేదనీ, వదంతులు నమ్మొద్దని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు