ప్లీజ్‌.. మా ఊరికి రావద్దు

29 May, 2018 15:36 IST|Sakshi
సిమ్లాలో నీటి కోసం బారులు తీరిన ప్రజలు

సిమ్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ : దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే మా ఇంటికోస్తే ఓ పూట భోజనం పెడ్తాం.. కానీ గుక్కెడు నీళ్లు మాత్రం ఇవ్వలేం అనే దయనీయ పరిస్ధితులు ఏర్పడ్డాయి. హిమాచల్‌ రాజధాని సిమ్లా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతోంది. ఈ వేసవి తాపానికి దూరంగా.. చల్లగా సేద తీరాలనుకునే వారికి, ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వేసవి విడిది సిమ్లా. నిత్యం టూరిస్టులతో కిక్కిరిసి ఉండే సిమ్లా మాల్‌ రోడ్డు ప్రాంతం ప్రస్తుతం నీళ్ల బిందెలు పట్టుకుని బారులు తీరిన ప్రజలతో నిండిపోయింది. వారం రోజులుగా సిమ్లాలో కుళాయిల నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో పర్యాటకులను తమ నగరానికి రావద్దని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుతం సిమ్లాలో ఏర్పడ్డ అకాల నీటి కరువు గురించి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాక వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయం గురించి హిమాచల్‌ ముఖ్యమంత్రి అధికారులతో చర్యలు జరుపుతున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరుఫున 14 వాటర్‌ ట్యాంకర్లను, 8 పికప్‌ వెహికల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక మొత్తం సిమ్లా పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించామని, అన్ని ప్రాంతాలకు సమానంగా వాటర్‌ ట్యాంకర్‌లను పంపుతున్నట్లు ప్రకటించారు.

ఇవే కాక ప్రతి వార్డుకు ఒక వాటర్‌ ట్యాంకర్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం రాజకీయ నాయకులు, సినీతారలు ఉండే ప్రాంతాలకే ఎక్కువ మొత్తంలో వాటర్‌ ట్యాంకర్లను పంపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నీటి ఎద్దడి నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు పర్యాటకులను తమ ఊరికి రావద్దని వేడుకుంటూ సామాజిక మాధ్యామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హోటళ్లు కూడా బుకింగ్‌లను రద్దు చేసుకునేందుకు అనుమతించటమే కాక రద్దు చేసుకున్న మొత్తాన్ని రీఫండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు