నేటి నుంచి షిర్డీ బంద్‌

19 Jan, 2020 03:57 IST|Sakshi

సీఎం ప్రకటనకు నిరసనగా స్థానికుల పిలుపు

దుకాణాలు మూసివేస్తామని ప్రకటన

ఆలయం తెరిచే ఉంటుందన్న సంస్థాన్‌ ట్రస్ట్‌

నేడు సీఎం ఉద్ధవ్‌ భేటీ

అహ్మద్‌నగర్‌/షిర్డీ: శ్రీ సాయి జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముదిరింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్‌ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే, ఆదివారం ఆలయం తెరిచే ఉంటుందని, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ పేర్కొంది. సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇలా ఉండగా, ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సెక్రటేరియట్‌లో ఆదివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

షిర్డీ వాసుల్లో ఆగ్రహం
బాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడం వివాదమైంది. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, షిర్డీ వాసులు శనివారం సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌లో దాదాపు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పత్రిలోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పత్రి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హోటళ్లలో బుకింగ్‌ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదని, దుకాణాలు మాత్రమే మూతబడి ఉంటాయన్నారు.

ఆధారాలున్నాయి: ఎన్సీపీ నేత దుర్రానీ
పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ..బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు