షిర్డీ ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ

16 Oct, 2013 20:47 IST|Sakshi
షిర్డీ ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ

ముంబై/ఇండోర్(పిటిఐ): ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని పేల్చివేస్తామని షిర్డీ ట్రస్ట్‌కు వచ్చిన ఓ బెదిరింపు లేఖ కలకలం సష్టించింది. నవంబర్ 9న షిర్డీ ఆలయంతోపాటు ముంబైలో ఠాక్రే నివాసమైన మాతోశ్రీని కూడా పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు రాసిన లేఖ వచ్చిందని పోలీసులు చెప్పారు. అదేరోజున ముంబై దాదర్‌లోని శివసేన కార్యాలయాన్ని, శివాజీ పార్క్ మైదానంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేకు అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని, ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేష్ ఆలయాన్ని కూడా బాంబులతో పేల్చేస్తామని హిందీలో రాసిన ఆ లేఖలో హెచ్చరించారు. దీంతో అటూ బాబా సంస్థాన్ పదాధికారుల్లో ఇటూ శివసైనికుల్లో కలవరం మొదలైంది. సోమవారం సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన లక్షలాది భక్తులు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. అంతలోనే బాంబులతో ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ రావడం భక్తుల్లో కలవరం సష్టించింది.

ఈ లేఖ మంగళవారం రాత్రి 9.30 గంటలకు కొరియర్ ద్వారా తమకు అందిందని షిర్డీ ట్రస్ట్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి అజయ్ మోరే విలేకరులకు తెలిపారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు.  ఆలయంలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించకుండా నిషేధం విధించారు.

 నవంబరు 9న రాత్రి 9.11 గంటలకు సాయి సమాధి మందిరాన్ని, 9.22 గంటలకు సేనా భవన్, ఆ తరువాత 10 నిమిషాలకు ముంబైలోని శివాజీపార్క్‌లో శివసేన అధినేత బాల్ ఠాక్రే అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని పేల్చివేస్తామని ఆ లేఖలో రాశారు. ఇండోర్‌లో ఖలీల్ అనే వ్యక్తితోపాటు అతని బంధువును చంపినందుకు నిరసనగా ఈ పేలుళ్లు జరుపుతామని లేఖలో హెచ్చరించారు.  దీనిపై దర్యాప్తు జరిపేందుకు రెండు బృందాలను నియమించామని అహ్మద్‌నగర్ ఎస్పీ రావ్‌సాహెబ్ షిండే చెప్పారు.

ఇండోర్‌లోని గణేష్ గుడి వద్ద కూడా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా నిషేధం విధించినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు