గోరేగావ్‌లో శివసేన బైక్‌ర్యాలీ

13 Oct, 2014 23:48 IST|Sakshi

బోరివలి, న్యూస్‌లైన్: గోరేగావ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన శివసేన అభ్యర్థి సుభాష్ దేశాయ్ ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. గోరేగావ్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలైన ర్యాలీ ఎస్వీ రోడ్డు మీదుగా సర్వోదయ బాలికల పాఠశాల వరకు సాగింది. ఈ ర్యాలీలో శివసేన మహరాష్ట్ర తెలుగు సంఘటన కార్యకర్తలు పాల్గొని శివసేనకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సుభాష్ దేశాయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచి పేదవాని నడ్డి విరిచిందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, పేదోడు నగరంలో జీవించే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రలో శివసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్త పరిచాడు.

ఈ ర్యాలీలో బాలీవుడ్ నటుడు ప్రదీప్‌రావత్  కూడా పాల్గొన్నారు. సుభాష్ దేశాయ్‌కి మద్దతు తెలిపాడు. శివసేన మహరాష్ట్ర తెలుగు సంఘటన కార్యాధ్యక్షుడు టి. ప్రకాష్ స్వామి మాట్లాడుతూ... గోరేగావ్ నియోజక వర్గంలో ఉన్న పదివేల మందికిపైగా తెలుగు ఓటర్లు శివసేనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చాడు. సుమారు 25 సంవత్సరాల నుండి తెలుగు ప్రజల యోగ క్షేమాలు చూస్తూ.. ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుకు వచ్చేది సుభాష్ దేశాయ్ మాత్రమేనని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు