మోదీని పెద్దన్న అంటూనే..

29 Nov, 2019 08:30 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి సర్కార్‌ కొలువుతీరిన అనంతరం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ధవ్‌కు పెద్దన్న అంటూ వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు నెలకొన్నా ప్రధాని మోదీ, ఉద్ధవ్‌ల మధ్య సోదర భావం ఉందని పేర్కొంది. ప్రధాని కేవలం ఒక పార్టీకే కాదు జాతి మొత్తానికి చెందిన వారని స్పష్టం చేసింది. ఈ విషయం గమనంలో ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్దేశాలతో విభేదించే వారి పట్ల ఆగ్రహం ఎందుకు వెలిబుచ్చుతుందని ప్రశ్నించింది.

పోరాటం, సంఘర్షణ జీవితంలో భాగమని శివసేన సంపాదకీయం పేర్కొంది. ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు..కానీ మహారాష్ట్ర ఢిల్లీ దేవుళ్లకు బానిస కాదని స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన బాలాసాహెబ్‌ ఠాక్రే కుమారుడు ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకు అందించిన ఆత్మ గౌరవం తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. మోదీని పెద్దన్న అంటూనే కేంద్రానికి, బీజేపీకి శివసేన గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు