కేజ్రీవాల్ ఒక్కడే..

7 Feb, 2020 14:28 IST|Sakshi

ముంబై : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా ఆప్‌ చీఫ్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై శివసేన ప్రశంసలు గుప్పించింది. ఓట్ల వేటలో బీజేపీ మతపరమైన విభజనకు పాల్పడుతున్న క్రమంలో ఆ పార్టీ కుయుక్తులను కేజ్రీవాల్‌ దీటుగా ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీలో గెలిచేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ సీఎంలు, 200 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ప్రచారంలో దిగగా వారందరినీ కేజ్రీవాల్‌ ఒక్కడే ఎదుర్కొంటున్నారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది.

గత ఐదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగా కేజ్రీవాల్‌ ఢిల్లీ ఓటర్లను ఓట్లు కోరుతున్నారని, పార్టీలకు అతీతంగా దీన్ని అందరూ స్వాగతించాలని పేర్కొంది. ఎండిన చెరువులో కమలం వికసించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేసింది. ఢిల్లీ ప్రజలు తెలివైనవారని ఎవరిని ఎంచుకోవాలో వారికి తెలుసునని వ్యాఖ్యానించింది. ఆప్‌ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ ఆటంకాలు సృష్టిస్తోందని దుయ్యబట్టింది. కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిమిత అధికారాలతోనే కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్యా, వైద్య, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మంచి పురోగతి సాధించిందని పేర్కొంది.

మోదీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్‌ తరహాను అనుసరించాలని శివసేన హితవు పలికింది. కేజ్రీవాల్‌ ఎంతగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అభినందించాల్సిన కేంద్రం అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని సేన తప్పుపట్టింది. ఉగ్రవాదైతే ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2015లో 70 శాతం ఢిల్లీ ఓటర్లు ఉగ్రవాదికి ఓటు వేశారని బీజేపీ భావిస్తోందా అని ప్రశ్నించింది.

చదవండి : బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా