పీవీ తర్వాత మన్మోహనే గొప్ప ప్రధాని : శివసేన

5 Jan, 2019 16:38 IST|Sakshi

ముంబై : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా ట్రైలర్‌తోనే వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కాంగ్రెస్‌ నేతలు బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నాయకులు మన్మోహన్‌ సింగ్‌ని పొగడ్తలతో ఆకాశనికెత్తుతున్నారు. పీవీ తర్వాత మన దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహనే గొప్పవాడంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగా శివసేన పార్టీ నాయకుడు సంజయ్‌ రౌతులా మాట్లాడతూ.. ‘పదేళ్లు దేశానికి సేవ చేసిన వ్యక్తిని గౌరవించడం మన బాధ్యత. మన్మోహన్‌ యాక్సిడెంటల్‌ ప్రధాని కారు. పీవీ నరసింహ రావు తర్వాత దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహన్‌ చాలా గొప్పవారు. ఆయన తన విధులను చాలా విజయవంతంగా నిర్వర్తించారు’ అంటూ ప్రశంసలు కురిపించారు.

అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా పట్ల ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకులు కోపంగా ఉన్నారు. ఈ సినిమాలో సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీని తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ నాయకులైతే ఏకంగా తమకు స్పెషల్‌ షో వేసి.. ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని హెచ్చరించారు.

ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు