ఐసీయూలో పాకిస్తాన్‌ : శివసేన

19 Aug, 2019 14:38 IST|Sakshi

ముంబై : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పాకిస్తాన్‌పై శివసేన సోమవారం మరోసారి విరుచుకుపడింది. అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ ఇప్పటికే ఐసీయూలో ఉందని, కశ్మీర్‌పై దృష్టి కేంద్రీకరించడం మాని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ముందు తన సొంతింటిని చక్కదిద్దుకుంటే మంచిదని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయ వేదికలపై పాక్‌, చైనా రాద్ధాంతం చేయాలని విఫలయత్నం చేశాయని మండిపడింది.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలు పెద్దసంఖ్యలో బాసటగా నిలిచాయని పేర్కొంది. పాక్‌ తీరును అమెరికా తప్పుపట్టినా ఆర్టికల్‌ 370 రద్దుపై చైనా ఊతంతో పాక్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం పాకులాడుతోందని దుయ్యబట్టింది. కశ్మీర్‌పై రాద్థాంతం పక్కనపెట్టి పాక్‌ తమ దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, పేదరికం, ఆర్థిక దుర్భర పరిస్థితులపై దృష్టిసారించాలని సామ్నా సంపాదకీయంలో సేన హితవు పలికింది.

మరిన్ని వార్తలు