లక్షమందితో రేపే ధర్మసభ

24 Nov, 2018 04:03 IST|Sakshi
థానె నుంచి అయోధ్యకు బయల్దేరుతున్న శివసేన కార్యకర్తలు

రామమందిర ఎజెండాతో అయోధ్యలో వీహెచ్‌పీ సభ

ముంబై/లక్నో/అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆదివారం అయోధ్యలో భారీ ధర్మసభను నిర్వహించనుంది. 1992 డిసెంబర్‌ 6వ తేదీన వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో హాజరైనంతమంది కరసేవకులు ధర్మసభకు వచ్చే వీలుంది. నేడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తమ కార్యకర్తలతో కలిసి అయోధ్యకు రానున్నారు.

నేతలకు చోటులేదు
ధర్మసభకు దాదాపు లక్షమంది కరసేవకులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే, రాజకీయ సభ కాదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ఇక్కడే రామమందిర నిర్మాణ తేదీని ఖరారు చేస్తాం. ధర్మసభతో ఆలయ నిర్మాణంలో ఆఖరి అడ్డంకి తొలగిపోతుంది. దీని తర్వాత ఎటువంటి సభలు, ర్యాలీలు, నిరసనలు, చర్చలు ఉండబోవు’ అని స్పష్టం చేసింది. వేదికపై రాజకీయ నేతలకు చోటులేదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ధర్మసభ ప్రధాన వేదికపై కేవలం సాధువులు మాత్రమే కూర్చుంటారు. రాజకీయ నేతలెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపింది.  ‘ధర్మసభ, ర్యాలీకి లక్షమందికిపైగా వస్తారని భావిస్తున్నాం. ఆర్డినెన్స్‌ లేదా పార్లమెంట్‌లో బిల్లు తేవడం ద్వారా మందిర నిర్మాణం చేపట్టేందుకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి గట్టి సంకేతం పంపుతాం’ అని వీహెచ్‌పీ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శి చెప్పారు. 25న నాగ్‌పూర్, బెంగళూరుల్లో, డిసెంబర్‌ 9న ఢిల్లీలో ఇలాంటి ర్యాలీలు చేపట్టనున్నారు.

17 నిమిషాల్లో కూల్చేశాం..
1992లో రామ భక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును 17 నిమిషాల్లోనే కూల్చివేశారు. గుడి కోసం ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందని శివసేన నిలదీసింది. ‘ ఆ మసీదును 17 నిమిషాల్లో కూల్చేశారు. అప్పటి నుంచి ఆ ఖాళీ అలాగే ఉంది. ఆర్డినెన్స్‌ పత్రాలు తయారు చేసేందుకు, రాష్ట్రపతి భవన్‌ నుంచి యూపీ అసెంబ్లీకి అవి చేరేందుకు ఎంత సమయం పడుతుంది. అక్కడా ఇక్కడా ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కదా? అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. మందిరం కోసం ఆర్డినెన్స్‌ తేవాలనీ, నిర్మాణ తేదీని ఖరారు చేయాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో డిమాండ్‌ చేసింది. ‘అయోధ్యలో ప్రస్తుతం రామరాజ్యం లేదు. ఉన్నది సుప్రీంకోర్టు రాజ్యం. మా యాత్రపై పెడార్థాలు తీయడం మానేసి, గుడి కట్టే తేదీ తేల్చండి’ అని కేంద్రాన్ని కోరింది.  
 

మరిన్ని వార్తలు