'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!

2 Jun, 2016 18:12 IST|Sakshi
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!

చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్  ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో  భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.  

2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది.

ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి  పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు