ప్రమాదపుటంచుల్లో శివాజీ మార్కెట్ భవనం

6 Jul, 2013 00:12 IST|Sakshi

 సాక్షి, ముంబై: బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి చెందిన శివాజీ మార్కెట్ భవనం ప్రమాదపుటంచుల్లో ఉంది. దీంతో అందులో పనిచేస్తున్న వందలాది బీఎంసీ ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం అక్కడి వచ్చే అనేకమంది ప్రాణాలకు ముప్పుపొంచి ఉంది. అది ఎప్పుడు నేలకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో ప్రమాదపుటంచుల్లో ఉన్న భవనాల్లో నివిసిస్తున్న కుటుంబాలను ఇటీవల బీఎంసీ ఖాళీ చేయించింది. ఇంరా ఖాళీ కాని భవనాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని కూడా ఆదేశించింది. ఇతరుల విషయంలో కఠినంగా వ్యవహరించే బీఎంసీ అధికారులు.. సొంత భవనమే శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దాన్ని ఖాళీ చేయించాలనే ధ్యాసే లేకపోవడం గమనార్హం.
 
 ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) ఎదురుగా ఉన్న బీఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో శివాజీ మార్కెట్ భవనం ఉంది. దీన్ని ప్రమాదకర భవనంగా గతంలోనే బీఎంసీ అధికారులు ప్రకటించారు. ఇందులో కొన్ని అంతస్తుల్లో స్లాబ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్లాబ్ ప్లాస్టర్ ఊడిపడడంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
 
 మూడు, నాలుగు అంతస్తుల్లో స్లాబ్ కూలేలా ఉండడంతో కలపను అందుకు అడ్డుగా పెట్టారు. ఈ భవనంలో ఇప్పటికీ  కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇందులో బీఎంసీకి చెందిన ఆదాయం, పారిశుధ్యం, కీటనాశక, మంజూరు తదితర కీలక శాఖలతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రతిరోజూ తమ తమ పనుల కోసం వేలాది మంది వస్తుంటారు.  ఈ భవనం ప్రమాదకరంగా ఉన్న నేపథ ్యంలో అటు  విధులు నిర్వహించేవారితోపాటు పనుల నిమిత్తం వచ్చిన ప్రజల ప్రాణాలు ఏ క్షణంలోనైనా గాలిలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు.
 
 నగరంలో ఇటీవల రెండు భవనాలు కూలిపోయిన ఘటనలో 17 మంది మరణించారు. దీంతో కళ్లు తెరిచిన బీఎంసీ శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. అయితే తమ సొంత భవనంలో మాత్రం ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.  దీన్ని ప్రమాదకర భవనంగా ప్రకటించినట్లు వచ్చిపోయే ప్రజలకు తెలియజేసేందుకు ప్రవేశ ద్వారం వద్ద బోర్డు రాసి ఉంచడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు