సీఎం ఇంట్లో అసలు ఏమైంది?

16 Sep, 2016 08:46 IST|Sakshi
సీఎం ఇంట్లో అసలు ఏమైంది?

అప్పటివరకు అంతా బాగానే ఉందనుకున్నారు.. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని శివపాల్ చెప్పారు. అన్నయ్య నిర్ణయమే అంతిమం అని.. దాన్ని ఎవరూ కాదనలేరని కూడా అన్నారు. 2017 ఎన్నికల్లో అఖిలేశ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నయ్య నిర్ణయిస్తే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన తెలిపారు. కాసేపటి తర్వాత.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు.. అక్కడ ఇద్దరి మధ్య 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. పెద్దాయన చెప్పాడు కాబట్టి.. అబ్బాయి కాస్త మెత్తబడతాడని అనుకున్నాడు. కానీ, ఆ 20 నిమిషాల భేటీలో ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో, ఏ స్థాయిలో జరిగాయో తెలియదు. రాత్రి 9 గంటల సమయంలో శివపాల్ ఇంటికి తిరిగొచ్చారు. తెల్ల కాగితాలు తీసుకుని పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మరో లేఖ రాసేశారు. తన వ్యక్తిగత సహచరుడు ఒకరిని పిలిచి.. వాటిలో ఒకటి ములాయం సింగ్ యాదవ్‌కు, మరొకటి అఖిలేష్‌కు ఇచ్చి రమ్మని చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే మీడియాలో ఈ విషయం భారీగా ప్రచారం అయ్యింది. శివపాల్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ములాయం తనవైపే మొగ్గు చూపించారు కాబట్టి, తన నుంచి తీసేసిన ముఖ్యమైన మంత్రిత్వశాఖలను అఖిలేష్ మళ్లీ ఇస్తారని శివపాల్ భావించారు. కానీ అలా జరగలేదు. ఆ పదవులను గనక తిరిగిస్తే శివపాల్ ఉండేవారని, అలా జరక్కపోవడంతో ఆయన అహం దెబ్బతిని అన్నింటికీ రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేవలం మంత్రిపదవికి మాత్రమే రాజీనామా చేసి ఉంటే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంతా అనుకునేవారు. తద్వారా పార్టీకి.. అన్నయ్యకు కట్టుబడి ఉంటారని భావించేవారు. కానీ, ఇప్పుడు రెండు పదవులకూ రాజీనామా చేయడం ద్వారా ఆయన మళ్లీ బంతిని ములాయం కోర్టులోకి నెట్టేసినట్టయింది.

గురువారం అర్ధరాత్రికే ఈ విషయం శివపాల్ మద్దతుదారుల్లో దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా అంతా లక్నో వీధుల్లోకి చేరుకున్నారు. కాళిదాస్ మార్గ్‌లోని ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున అనుచరులు సంఘీభావంగా చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా శివపాల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని ములాయం ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందునుంచి పార్టీలో పట్టున్న శివపాల్‌ను దూరం చేసుకోలేరు, అలాగని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న అఖిలేష్‌ను కూడా బలిపెట్టలేరు.. రెండు కళ్లలో ఒకదాన్ని వదులుకోవాలంటే ఎలా అని మధన పడుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు