‘సైకిల్’ దిగిన శివ్పాల్

16 Sep, 2016 06:56 IST|Sakshi
‘సైకిల్’ దిగిన శివ్పాల్

మంత్రి, పార్టీ పదవులకు రాజీనామా 
శివ్‌పాల్ భార్య, కుమారుడు కూడా..

 లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి.. పార్టీ చీఫ్ ములాయం సోదరుడు, మంత్రి శివ్‌పాల్ యాదవ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ములాయంతో అత్యవసర భేటీ తర్వాత వివాదం సద్దుమణుగుతుందన్న సమయంలో శివ్‌పాల్ రాజీనామా ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శివ్‌పాల్ భార్య సరళ (ఎటావా జిల్లా సహకార బ్యాంకు చైర్‌పర్సన్), కుమారుడు ఆదిత్య (ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్) కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

అయితే వీరి రాజీనామాను ములాయం, అఖిలేశ్ తిరస్కరించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు అధికార సమాజ్‌వాదీ పార్టీ(సైకిల్ గుర్తు)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనబడుతోంది. అఖిలేశ్ ప్రభుత్వ పాలనను, శివ్‌పాల్ యూపీలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారనుకున్న తరుణంలో తాజా పరిణామాలు ములాయం సింగ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఫలించని మధ్యవర్తిత్వం
బాబాయ్- అబ్బాయ్ మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు శుక్రవారం ములాయం లక్నోకు రావాల్సి ఉంది. అయితే.. శివ్‌పాల్ తీరుపై అనుమానంతో గురువారం సాయంత్రమే ఢిల్లీ నుంచి  ములాయం హుటాహుటిన లక్నోకు చేరుకున్నారు. శివ్‌పాల్,  కుమారుడు అఖిలేశ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అఖిలేశ్‌ను సీఎం అధికార నివాసంలో కలిసిన శివ్‌పాల్ కాసేపు వ్యక్తిగతంగా చర్చించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. కాసేపటికే శివ్‌పాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే మీడియాతో మాట్లాడుతూ.. ‘అందరినీ కలుపుకుని పోతేనే పార్టీ నిర్మాణం సాధ్యమవుతుంది’ అని తెలిపారు.

అంతా ‘ఔట్ సైడర్’ వల్లే..
సమాజ్‌వాదీ పార్టీలో కానీ, యాదవ కుటుంబంలో కానీ భేదాభిప్రాయాలు లేవని.. కేవలం బయటివాళ్ల కారణంగానే.. చిన్న అపార్థాల వల్లే కీలకనేతల మధ్య సమాచార లోపం ఏర్పడిందని ఎస్పీ జాతీయ కార్యదర్శి, ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. ఈ తతంగం జరగటానికి ముందే అఖిలేశ్‌తో సమావేశమైన రాంగోపాల్.. బయటకొచ్చాక.. అఖిలేశ్‌ను పార్టీ యూపీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన అధిష్టానం చాలా పెద్ద పొరపాటు చేసిందన్నారు.

పార్టీ కోరితే అఖిలేశ్ రాజీనామా చేసేవారన్నారు. ‘పార్టీలో, కుటుంబంలో సమస్య లేదు. బయటి వారి వల్లే (అమర్‌సింగ్ పేరు తీసుకోకుండా) సమస్యలొస్తున్నాయి. నేతాజీ (ములాయం)తో అఖిలేశ్, శివ్‌పాల్‌తో మాట్లాడితే సమస్య సమసిపోతుంది’ అని తెలిపారు. అటు రాజ్యసభ ఎంపీ నరేశ్ అగర్వాల్, సీనియర్ కేబినెట్ మంత్రి ఆజంఖాన్ కూడా అఖిలేశ్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికలకు కూడా అఖిలేశ్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నారు.

>
మరిన్ని వార్తలు