చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

20 Jun, 2020 14:09 IST|Sakshi

భోపాల్‌: భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గాల్వన్‌లో లోయలో ఇరు దేశాల రక్షణ దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత సైనికులు మరణించారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘బాయ్‌కాట్‌ చైనా’ నినాదం మార్మోగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ‘బాయ్‌కాట్‌ చైనా’కు మద్దతిచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైనాలో తయారయిన వస్తువులను బహిష్కరించాల్సిందిగా మధ్యప్రదేశ్‌ ప్రజలను కోరుతున్నాను. మన సైన్యం వారికి తగిన సమాధానం చెప్పింది. అలానే మనం కూడా వారిని ఆర్థికంగా దెబ్బతీయాలి’ అని చౌహాన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చైనా దురాక్రమణకు నిరసనగా ప్రజలు తమ ఫ్లాట్‌ టీవీలను బాల్కనీల నుంచి బయటకు విసిరేయడం.. చైనాలో తయారయిన ఎలక్ట్రానిక్స్‌ను దహనం చేస్తున్న దృశ్యాలు తెగ వైరలవుతున్నాయి. (చైనా 'బే'జార్‌)

సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. (బాయ్‌కాట్‌ చైనా)

మరిన్ని వార్తలు