ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం : విచారణ తర్వాతే అరెస్ట్‌లు

21 Sep, 2018 13:26 IST|Sakshi

భోపాల్‌ : ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారణ లేకుండా రాష్ట్రంలో అరెస్ట్‌లు ఉండవని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎస్‌సీ, ఎస్‌టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో సీఎం ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం దుర్వినియోగం చేయడాన్ని మధ్యప్రదేశ్‌లో అనుమతించబోమని, విచారణ అనంతరమే అరెస్టులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.

ఎస్‌సీ, ఎస్‌టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 6న అగ్రవర్ణ సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసం వరకూ నిరసన ర్యాలీ చేపట్టామని బ్రహ్మ సమాగమ్‌ సవర్ణ జన్‌కళ్యాణ్‌ సమాజ్‌ కన్వీనర్‌ ప్రహ్లాద్‌ శుక్లా చెప్పారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు