‘భారత్‌లాగే పాక్‌లో పౌరసత్వ బిల్లు పెట్టాలి’

11 Dec, 2019 11:10 IST|Sakshi
శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

భోపాల్‌: పౌరసత్వ సవరణ బిల్లుపై భారత ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్విటర్‌లో స్పందించిన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఎమోజీలతో బదులిచ్చారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం హోం శాఖ మంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రవేశపెట్టగా, భారీ మెజార్టీతో లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనీ, మోదీ ప్రభుత్వం ఫాసిస్టులా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై శివరాజ్‌సింగ్‌ బదులిస్తూ మూడు ఎమోజీలను ఆయన ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు చౌహాన్‌ను ప్రశంసిస్తూ.. ‘మామాజీ రాక్స్‌’, ‘క్యా ధోయా హై.. మజా ఆగయా’ అని ట్వీట్లు పెట్టారు. ఒక ట్వీటర్‌ అయితే ఈ బిల్లు వల్ల భారతదేశంలో అసౌకర్యానికి గురవుతున్న వారికి పాకిస్తాన్‌ పౌరసత్వం ఇచ్చేలా ఇమ్రాన్‌ ఖాన్‌ తమ దేశంలో ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. దీనిపై చౌహాన్‌ స్పందిస్తూ.. నిజమైన భారతీయుడు భారతదేశంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాడని స్పష్టం చేశారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. కాగా, ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు