హోంమంత్రిపై అసెంబ్లీ ముందే షూ విసిరాడు

2 Mar, 2017 16:54 IST|Sakshi
హోంమంత్రిపై అసెంబ్లీ ముందే షూ విసిరాడు

గాంధీనగర్‌: గుజరాత్‌ హోంమంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఓ వ్యక్తి తన షూను ఆయనకు విసిరికొట్టారు. అది కూడా అతి చేరువ నుంచి. మొత్తం మీడియా అంతా పొగై ఉన్న సమయంలో గుజరాత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోపంగా తన షూలు తీసి విసిరాడు. రెప్పపాటులో ఆ షూ ఆయనకు తగలకుండా పక్కకు పడిపోయింది. దీంతో అక్కడ అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ముందు గురువారం హోంమంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా మాట్లాడబోతుండగా గోపాల్‌ ఇతాలియా అనే వ్యక్తి నేరుగా అరుస్తూ షూ ఆయనపైకి విసిరేశాడు. అతడు ఒక నిరుద్యోగి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీకి మధ్య జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డాడు.

అది కాకుండా నిరుద్యోగిగా ఉన్న అతడు రాష్ట్రంలో అభివృద్ధే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలనకు, అవినీతికి గుర్తుగా తన షూ ఇస్తున్నానంటూ విసిరి కొట్టాడు. మీడియా సమాచారం ప్రకారం ఈ యువకుడు అంతకుముందు నిరుద్యోగిత అంశంపై డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. షూ విసిరిన అతడు నేరుగా హోంమంత్రిపైకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు. సెక్యూరిటీ, పోలీసులు నిలువరించడంతో మరింత గందరగోళం ఆగినట్లయింది.

మరిన్ని వార్తలు