మా పాప చేసిన తప్పేంటి?

26 Nov, 2018 14:04 IST|Sakshi
తల్లి ఒడిలో హిబా నిసార్‌ (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫొటో)

‘ఆమె చేసిన తప్పేంటి? లోకం తెలియని పసిపాప. ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను దేవుడిని కోరేది ఒక్కటే. దీనంతకీ కారణమైన వారిని కఠిన శిక్ష పడాలి’ ఓ తల్లి ఆవేదన ఇది. తన 20 నెలల కుమార్తె హిబా నిసార్‌ కంటిపాపను చిదిమేసిన వారిపై మార్సలా జాన్‌ వ్యక్తం చేసిన ఆక్రందన అందరినీ కదిలిస్తోంది.

జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని శ్రీ మహరాజ హరిసింగ్ (ఎస్ఎంహ​చ్‌ఎస్‌) ఆస్పత్రి‌ ఆప్తమాలజీ విభాగంలో నాలుగో నంబరు మంచంపై హిబా నిసార్ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాన్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చాకెట్లు, స్వీట్లు ఇచ్చి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కంటి గాయం బాధను తట్టుకోలేక చిన్నారి రోదిస్తూనే ఉంది. షొపియాన్‌లో ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కుడి కంటికి గాయమైంది. ఇంట్లో ఆడుకుంటున్న హిబా కంట్లోకి పెల్లెట్‌ దూసుకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శత్రచికిత్స చేసి పెల్లెట్‌ను తొలగించారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కుడి కంటిచూపు పోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో హిబా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏం జరిగింది?
షోపియాన్‌లో ఆదివారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగడంతో భద్రతా దళాలు, అల్లరి మూకలకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పౌరుడొకరు ప్రాణాలు కోల్పోగా, 50 మందిపైగా గాయపడ్డారు. ఇదే గొడవలు హిబా కంటి గాయానికి కారణమయ్యారు. తమ ఇంటి దీపం హిబాకు గాయమైన క్రమాన్ని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’తో ఆమె తల్లి జాన్‌ వివరించారు. ‘మేము ఇంట్లో ఉండగా బయట టియర్‌ గ్యాస్‌ కాల్పులు కొనసాగాయి. బయటంతా పొగ కమ్మేయడంతో ఐదేళ్ల నా కుమారుడు శ్వాస పీల్చుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో నా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాను. వెంటనే తలుపులు తీశాను. ముగ్గురు వ్యక్తులు(భద్రతా సిబ్బంది) నేరుగా మాపైకి పెల్లెట్లను ప్రయోగించార’ని వెల్లడించారు. హిబా కుటుంబం షొపియాన్‌ జిల్లా బాత్‌గండ్‌ ప్రాంతంలోని కాప్రిన్‌ గ్రామంలో నివసిస్తోంది. ఆదివారం ఇక్కడే అల్లర్లు జరిగాయి. వైద్యుల సలహా మేరకు హిబాను షొపియాన్‌ నుంచి శ్రీనగర్‌కు తీసుకెళ్లారు.

కొడుకు ఎలా ఉన్నాడో?
తన పిల్లలను కాపాడుకునే క్రమంలో తన చేతికి కూడా గాయమైందని మార్సలా జాన్‌ తెలిపారు. హిబాను రక్షించేందుకు తన చేతిని ఆమె ముఖానికి అడ్డుగా పెట్టానని చెప్పారు. తన చేతి పక్క నుంచి పెల్లెట్‌ హిబా కంట్లోకి దూసుకుపోయిందన్నారు. తమ కొడుకు గురించి కూడా జాన్‌, ఆమె భర్త నిసార్‌ అహ్మద్‌ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడి దేహంలోకి పెల్లెట్లు దూసుకెళ్లాయేమో చూడాలని షొపియాన్‌లోని తన బంధువులకు ఫోన్‌ చేసి చెప్పారు. పెల్లెట్ల బారి నుంచి కాపాడేందుకు తన కుమారుడిని మరోవైపుకు తోసేసినట్టు వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని దీనంగా చెప్పారు.

హిబా ఆరోగ్య పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఎస్ఎంహ​చ్‌ఎస్‌ ఆస్పత్రి‌ వైద్యులు తెలిపారు. ‘ఆమె పరిస్థితి బాలేదు. చేతి వేళ్లు చూపించి చికిత్సకు చిన్నారి ఏవిధంగా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాం. పెల్లెట్‌ కారణంగా కంటిలోని కార్నియా దెబ్బతింద’ని ఆప్తమాలజీ విభాగం డాక్టర్‌ ఒకరు వెల్లడించారు. చిన్నారి హిబా పడుతున్న యాతన ఆస్పత్రి సిబ్బందితో పాటు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె కంటిచూపు కలకాలం ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు