మంచు మనిషి ‘యెతి’ నిజంగా ఉన్నాడా?!

1 May, 2019 18:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘హిమాలయ పర్వతాల్లో భారీ మంచు మనిషిగా భావించే ‘యెతి’కి చెందిన 32 అంగుళాల పొడువు, 15 అంగుళాల వెడల్పు పాద ముద్రలు కనుగొన్నాం’ అంటూ భారత సైన్యం మంగళవారం ట్వీట్‌ చేయడంతో మరోసారి ‘యెతి’ గురించి చర్చకు వచ్చింది. యెతి భీకర ఆకారంలో ఉండే ఆది మానవుడని, ఆసహ్యంగా ఉండే భారీకాయుడని, మంచి వాడని, చెడ్డవాడని అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. హిమాలయాలు విస్తరించిన నేపాల్, చైనా, భారత్, భూటాన్, మయన్మార్‌ ప్రాంతాలకు ఈ ఊహాగానాలు విస్తరించాయి. వీటి ఆధారంగా యెతి క్యారెక్టర్‌పై  బాలివుడ్, హాలివుడ్‌ చిత్రాలే కాకుండా పలు కార్టూన్, యానిమేషన్‌ చిత్రాలు, పలు పుస్తకాలు వచ్చాయి. కొన్ని వీడియో గేముల్లో కూడా ఈ క్యారెక్టర్‌ కనిపిస్తుంది.

1991లో భారత్‌ బాలివుడ్‌కు చెందిన రామ్‌సే బ్రదర్స్‌ ‘అజూబా కుద్రత్‌ కా’ పేరిట యెతిపై ఓ చిత్రాన్ని నిర్మించారు. అందులో యెతి ఓ చిన్న బాలికతో స్నేహం చేస్తూ ఆమె తరఫున చెడు బాలలతో పోరాటం చేస్తుంది. అందులో ‘యెతి ఐ లవ్‌ యూ’ అనే పాట కూడా ఉంది. ఇక హాలీవుడ్‌లో యెతిపై 1957లో ‘ది అబామినబుల్‌ స్నోమేన్‌’, 1964లో ‘రుడాల్ఫ్‌ ద రెడ్‌–నోస్డ్‌ రీయిండీర్‌’ పేరిట యానిమేషన్‌ చిత్రాలు వచ్చాయి. ఆతర్వాత 2001లో ‘మాన్‌స్టర్స్, ఇన్‌కార్పొరేషన్,’ 2014లో ‘ది లెగో మూవీ’ యానిమేషన్‌ చిత్రాలు వచ్చాయి, 2013లో వచ్చిన ‘ది మమ్మీ టూంబ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ ఎంపరర్‌’ చిత్రంలో భారీ మంచు మనిషి రూపంలో యెతి కనిపిస్తుంది. 2017లో బెంగాలిలో ‘యెతి అభిజాన్‌’ చిత్రం వచ్చింది. ‘గ్రాండ్‌ థెఫ్ట్‌ ఆటో ఫైవ్‌’ టైటిల్‌తో వచ్చిన వీడియో గేమ్‌లో కూడా యెతి పాత్ర ఉంటుంది. ‘టిన్‌టిన్‌ ఇన్‌ టిబెట్‌’ కామిక్‌ పుస్తకంలోను యెతి క్యారెక్టర్‌ ఫేమస్‌. అన్నింట్లోను యెతి ఆకారాన్ని ఆసహ్యంగానే చూపినప్పటికీ ఎక్కువగా మంచితనానికి మారుపేరుగా చూపించారు. ఇంతటి ప్రాచుర్యం పొందిన యెతి ఎప్పుడు పుట్టింది ? ఎక్కడ పుట్టింది ? ఎలా పుట్టింది ? అసలు అది ఏమిటీ?

1921లో తొలిసారి పాద ముద్రలు
బ్రిటీష్‌ సాహసికుడు లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ చార్లెస్‌ హొవర్డ్‌ బరీ 1921లో మౌంట్‌ ఎవరెస్ట్‌కు సరైన దారిని కనుగొనడంలో భాగంగా హిమాలయాల్లోకి వెళ్లారు. అప్పుడు ఆయనకు మంచుకొండలపై భారీ పాద ముద్రలు కనిపించాయి. అప్పుడు వాటి గురించి తన వెంట వచ్చిన స్థానికులను ప్రశ్నించగా వారు అవి ‘మెతోహ్‌ కాంగ్మీ’వని చెప్పారు. వారి స్థానిక భాషలో మెతోహ్‌ కాంగ్మీ అంటే ‘ఎలుగుబంటిని పోలిన మంచు మనిషి’ అని అర్థం. అయితే ఆయన దాన్ని ఇంగ్లీషులోకి ‘అబామినబుల్‌ స్నోమేన్‌’ అంటూ ఆయన పొరపాటున అనువదించారు. ఆంగ్లంలో అబామినబుల్‌ అంటే అసహ్యమైన అన్న అర్థం వస్తుంది. అందువల్ల ‘యెతి’ రూపం వికారంగా మారింది. కల్నల్‌ చార్లెస్‌ తాను రాసిన ‘మౌంట్‌ ఎవరెస్ట్‌ రికానాయ్‌సాన్స్, 1921’ పుస్తకంలో తొలిసారిగా యెతి అడుగుల గురించి ప్రస్తావించారు.

1951లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం
ఇంగ్లీష్‌ పర్వతారోహకుడు ఎరిక్‌ షింప్టన్‌ 1951లో నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులోని మెన్లంగ్‌ శిఖరాలకు వెళ్లారు. అప్పుడు ఆయనకు కూడా యెతి పాద ముద్రలు కనిపించడంతో వాటిని ఫొటో తీశారు. ఆ ఫొటో కారణంగా ప్రపంచవ్యాప్తంగా యెతి ఒక చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఆ పాద ముద్రల తాలూకు మంచు మనిషిని కనుగొనేందుకు పలు పరిశోధనలు మొదలయ్యాయి. ముఖ్యంగా 1954–60 మధ్యన బ్రిటీష్‌ నుంచి వెలువడుతున్న ‘ది డెయిలీ మెయిల్‌’ బృందం, అమెరికా చమురు అన్వేషకుడు టామ్‌ స్లిక్‌ బృందం, ప్రముఖ పర్వతారోహకుడు ఎడ్మండ్‌ హిల్లరీ పలు పరిశోధనలు జరిపారు. ఎవరు ‘యెతి’ని కనుగొనలేకపోయారు. యెతి పాద ముద్రల్లో కాలి బొటన వేలు, మనిషి కాలు బొటన వేలును పోలి ఉన్నట్లు ఉండడం వల్ల జంతువును పోలిన మనిషని,  మనిషిని పోలిన జంతువని, ఆది మానవుడని వార్తలు ప్రచారమయ్యాయి.

యెతి పాద ముద్రల్లో కాస్తా తేడాలను పరిశోధకులు గుర్తించారు. అవి ఒకరివి లేదా ఒక దానివి కావని, పలు జాతులకు చెందిన ఎలుగుబంట్లవని వారు భావించారు. హిమాలయ పర్వతాల్లో  సంచరించే  ‘ఉర్సస్‌ తిబేటనస్‌గా పిలిచే ఆసియాటిక్‌ నలుపు ఎలుగు బంటు, ఉర్సస్‌ మారిటమ్స్‌ అనే తెలుపు రంగు ఎలుగుబంటు, ఉర్సస్‌ ఆర్క్‌టస్‌ ప్రూనోసస్‌ అనే కాస్త నలుపు, ఉర్సస్‌ ఆర్కటస్‌ అని పిలిచే గోధుమ రంగు ఎలుగుబంట్ల పాద ముద్రలని శాస్త్రేవేత్తలు తేల్చారు. ఆ ఎలుగు బంట్లు చెట్లు ఎక్కుతాయని, అందుకు అనువుగా వాటి బొటన వేళ్లు మానవుడి బొటన వేలును పోలి ఉన్నాయని వారు చెప్పారు. అవి రాత్రపూటనే ఎక్కువగా సంచరిస్తాయికనుక, ఆ సమయంలో మానవులు లేదా పర్వతారోహకులు సంచరించరు కనుక ఎలుగు బంట్లకు బదులుగా వాటి పాదముద్రలే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

అయినప్పటికీ కనిపించని ‘మంచు మనిషి (యెతి)’ ఉన్నాడని ఇప్పటికీ నమ్మే వారు కోకొల్లలు. ‘అబామినబుల్‌ సైన్స్‌: ఆర్జిన్స్‌ ఆఫ్‌ ది యెతి, యెతి : ది ఎకాలోజికల్‌ మిస్టరీ, ది హిమాలయన్‌ ఆంత్రపాలోజి: ది ఇండియన్, టిబెటిన్‌ ఇంటర్‌ఫేస్‌ పుస్తకాల్లో యెతి గురించి, ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌’లో యెతి పరిశోధనల గురించి తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు