మాస్క్‌లతో రన్నింగ్‌ చేయవచ్చా?!

21 May, 2020 16:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. వాకింగ్, జాగింగ్‌ల కోసం, వాహ్యాలీకి పార్కులకు వెళ్లేందుకు యూరప్‌ దేశాలు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. మున్ముందు భారత్‌లో కూడా వాకింగ్, జాగింగ్‌లకు అనుమతిచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి మాస్క్‌లు ధరించి జాగింగ్‌లు, వాకింగ్‌లు చేయవచ్చా? ముఖ్యంగా జాగింగ్‌లు చేసేటప్పుడు ఆయాసం రాదా? అదే క్రీడాకారులు రన్నింగ్‌ చేస్తే మరింత ఇబ్బంది ఉండదా? మాస్క్‌లు ధరించిన సాధారణ ప్రజలే దమ్మాడడం లేదని, ఆయాసం వస్తోందని చెబుతున్నారుగదా! మాస్క్‌లు ధరించడం వల్ల సరిగ్గా ఆక్సిజన్‌ అందగా ఆయాసం వస్తోందని, అనారోగ్యం కూడా ఏర్పడవచ్చని కొందరు వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు.

చైనాలో ఇటీవల ఓ 26 ఏళ్ల జాగర్‌ ముఖానికి మాస్క్‌ ధరించి నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి కుప్పకూలిపోయారు. ఆయన్ని వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో చేర్చగా, అతని ఎడమ ఊపిరితిత్తి 90 శాతం కుంచించుకు పోయిందని, గుండె కూడా కుడి వైపునకు జరిగిందని వైద్యులు తేల్చారు. అదే చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల పిల్లలు మాస్క్‌లు ధరించి జాగింగ్‌ చేస్తూ కుప్ప కూలిపోయి చనిపోయారు. మాస్క్‌లు ధరించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయా? చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలకు అటాప్సీ చేయలేదు కనుక మాస్క్‌ల కారణంగానే వారు మరణించారని చెప్పలేం.

కరోనా నుంచి తప్పించుకోవాలంటే బయటకు వెళ్లినప్పుడు మూడు లేయర్లుగల మాస్క్‌లు, లేదా ఎన్‌95 మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి ధరించినా గాలిని పీల్చుకోగలం. ముక్కు, నోరుకు ఎలాంటి ఫిల్టర్‌ ఉన్నా గాలి పీల్చుకోవడం ఇబ్బందే అవుతుంది. పరుగెత్తుతున్నప్పుడు ముక్కుతోపాటు, నోటితో కూడా గాలిని ఎక్కువగా పీలుస్తారని, ఆ సమయంలో నోటికి ఆక్సిజన్‌ అవసరం పెరుగుతుందని ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’లో పని చేస్తోన్న డాక్టర్‌ అమోల్‌ పాటిల్‌ తెలిపారు. ముఖానికి మాస్క్‌ ధరించి పరుగెత్తడం కన్నా మాస్క్‌లు లేకుండా పరుగెత్తడమే బాగుంటుందని దర్శన్‌ వాగ్‌ లాంటి పలువురు కోచ్‌లు తెలిపారు. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని క్రమంగా అలవాటు చేసుకోవడం మంచిదని వారు సూచించారు. మొదట్లో మాస్క్‌లతోని మెల్లగా ప్రాక్టీస్‌ చేయాలని, తర్వాత క్రమేణ వేగం పుంజుకోవాలని చెప్పారు. పరుగెత్తడం ఆపి, ఆయాసం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరులకు దూరంగా వెళ్లి మాస్క్‌లను తొలగించి గాలి పీల్చుకోవచ్చని చెప్పారు. మాస్క్‌లను ధరించి పరుగెత్తడం వల్ల ఊపిరితిత్తులు మరింత బలపడే అవకాశం ఉందని దర్శన్‌ వాగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు