‘పొలిటీషియన్‌’ లాయర్లకు బార్‌ కౌన్సిల్‌ షాక్‌..!

10 Jan, 2018 17:48 IST|Sakshi
ప్రముఖ రాజకీయ నాయకుడు, లాయర్‌ కపిల్‌ సిబల్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేదా కార్పొరేటర్‌లుగా ఉంటూ లాయర్‌ వృత్తిని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులకు మంగళవారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని న్యాయవాద వృత్తి చేపట్టకుండా బార్‌ కౌన్సిల్‌ ఎందుకు డీబార్‌ చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సమాధానాలను కౌన్సిల్‌కు గడువు ఇచ్చింది.

ఈ విషయంపై నియమితమైన ముగ్గురు నిపుణుల కమిటీ.. దేశవ్యాప్తంగా 500 మందిపైగా ‘పొలిటీషియన్‌’ లాయర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఒకవేళ రాజకీయ నాయకులకు లాయర్లుగా కొనసాగే అర్హత లేదనే నిర్ణయం వెలువడితే, వారందరూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలకు దిగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్‌, లాయర్‌ అశ్విని ఉపాధ్యాయ పొలిటీషియన్‌ లాయర్లను డిబార్‌ చేయాలంటూ గతంలో భారతీయ ప్రధాన న్యాయమూర్తి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌లకు లేఖ రాశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో ఉదహరించిన అశ్విని.. ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న ఓ వ్యక్తి లేదా సంస్థ లేదా కార్పొరేషన్‌ ఓ కోర్టులో న్యాయవాదిగా వాదించలేదని పేర్కొన్నారు. కాగా, రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై బార్‌ కౌన్సిల్‌ ఈ నెల 22న తుది విచారణ జరపనుంది.

మరిన్ని వార్తలు