ప్రతి రోజు నీ భార్యను హాయ్ డార్లింగ్ అను: కోర్టు

2 Jul, 2016 09:22 IST|Sakshi
ప్రతి రోజు నీ భార్యను హాయ్ డార్లింగ్ అను: కోర్టు

ఇండోర్: పెటాకులవుతున్న ఓ పెళ్లిని ఓ జిల్లా కోర్టు నిలబెట్టింది. దూరమవుతున్న ఆ దంపతులకు ఆ బంధం విలువను గుర్తు చేసింది. భార్యా భర్తల మధ్య పరస్పర అనుబంధం మాటతీరు ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా చెప్పింది. మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో రమేశ్, రాశి(విజ్ఞప్తి మేరకు పేర్లు మార్చాం) అనే ఇద్దరికి వివాహం అయింది. వివాహం అయిన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రాశి ఆరునెలల కిందట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

అయినా గొడవలు సర్దుమనగలేదు. దీంతో రాశి పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు, తన బిడ్డకు అయ్యే పోషణ వ్యయం భర్త నుంచి ఇప్పించాలంటూ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ జిల్లా న్యాయమూర్తి గంగాచరణ్ దూబే డ్రైవర్ అయిన రమేశ్ కు భార్యభర్తల సంబంధం గుర్తు చేశాడు. భార్యమీద భర్త తప్పక ప్రేమ చూపించాలని అన్నాడు. ప్రతి రోజు సాయంత్రం 'హాయ్ డార్లింగ్.. ఎలా ఉన్నావు?ఈ రోజు నీకు ఎలా గడిచింది? అంటూ ప్రేమగా పలకరించాలని ఆయన స్వయంగా చెప్పారు. భర్త ఎప్పుడూ భార్యతోనే ఉండాలని, పుట్టింటికి వెళితే వెళ్లి ప్రేమ చూపించి తిరిగి తన వద్దకు తెచ్చుకోగలగాలని సూచించారు. వివాహాన్ని రక్షించాలి తప్ప భగ్నం చేయొద్దని అన్నారు.

మరిన్ని వార్తలు