మోదీ వల్లే యెడ్డీకి చెడ్డపేరు: సిద్ధరామయ్య

3 Jan, 2020 15:36 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని కర్ణాటకను పట్టించుకోవడం లేదని.. తద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చెడ్డ పేరు రావొచ్చని వ్యాఖ్యానించారు. తన సొంత పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పను అణగదొక్కడానికి ప్రధాని కర్ణాటకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక సీఎంగా యడ్యురప్పను తొలగించేందుకు కర్ణాటక బీజేపీలోని ఒక వర్గం కుట్ర పన్నుతుందని సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా సీఎం బీఎస్‌ యడ్యూరప్ప, గవర్నర్‌ వాజూభాయ్‌వాలను రాజ్‌భవన్‌లో కలిశారు. శుక్రవారం బెంగుళూరులో జరిగే ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌107వ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. కర్ణాటకకు ఆగస్టులో వరదలు వచ్చినప్పుడు కనీసం వచ్చి చూడలేదని దుయ్యబట్టారు. అదే విధంగా తుముకూరులో ఏర్పాటు చేసిన బహిరంగా సమావేశంలో రాష్ట్రానికి రూ. 50 వేల కోట్లు నిధులు విడుదల చేయాల్సిందిగా సీఎం యడ్యూరప్ప ప్రధానిని కోరగా బదులుగా.. ప్రధాని  ఒక్క మాట కూడా మాట్లడలేదని విమర్శించారు. సిద్దగంగ మఠం పర్యవేక్షకులకు భారతరత్న ప్రకటించాలని సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు.  అదే విధంగా వీర్ సావర్కర్ అవార్డు విషయంలో బీజేపీ తీరును తప్పుబట్టారు.

>
మరిన్ని వార్తలు