జల సంరక్షణలో భారత్‌ వెరీ పూర్‌!

9 Sep, 2019 15:30 IST|Sakshi

ఇటు వర్షాభావం అటు వరదలు

సాక్షి, న్యూఢిల్లీ : వాతావరణానికి సంబంధించి ఈసారి భారత్‌లో అసాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంది. వర్షాకాలం ఆలస్యమైంది. వర్షాలు అంత ఎక్కువగా లేకపోయినా అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ అకాల పరిస్థితలు వల్ల వేలాదిమంది మత్యువాత పడ్డారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? వర్షాకాలంలో ముందుగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాంను వరదలు ముంచెత్తాయి. తర్వాత మహారాష్ట్ర, కేరళను వరదలు కమ్ముకున్నాయి. మధ్య ఆగస్టు నెల నాటికి మధ్య భారతాన్ని వరదలు చుట్టుముట్టాయి. 

1950 నుంచి 2015 వరకు సంభవించిన వాతావరణ పరిస్థితులపై పుణెలోని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాఫికల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనం చేసి 2017లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అసాధారణ వరదల భారిన దాదాపు 82 కోట్ల మంది పడ్డారు. వారిలో 170 లక్షల మంది నిరాశ్రయులుకాగా, 69 వేల మంది మరణించారు. భూతాపోన్నతి ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరగడం వల్ల కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పడి,  వరదలు వచ్చాయని ప్రపంచ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేసిన ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ 2018లో విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. 

దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం పెద్దగా పెరక్కపోయినా కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పడి అసాధారణ వరదలు వచ్చాయని బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘దివేచ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’కు చెందిన ప్రొఫెసర్‌ జె. శ్రీనివాసన్‌ తెలిపారు. ఈసారి కేవలం ఒకే ఒక శాతం అధిక వర్షంతో వర్షాకాలం ముగుస్తుందని అంచనా వేసినప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదయింది. 2001లో దేశంలోని ప్రజలకు సగటున 1816 క్యూబిక్‌ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, గత జూలై నెల నాటికి సగటున 1544 క్యూబిక్‌ మీటర్ల నీరే అందుబాటులో ఉందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభకు తెలిపారు. 

భారత్‌లాగా దిగువ మధ్య ఆదాయంగల ఇతర దేశాల ప్రజలకు సగటున 3,013 క్యూబిక్‌ మీటర్ల నీరు అందుబాటులో ఉందంటే మన దేశం ఈ విషయంలో ఎంతగా వెనకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే ఎక్కువాదాయ దేశాల్లో ప్రజలకు సగటున 8,822 క్యూబిక్‌ మీటర్ల నీరు అందుబాటులో ఉంది. జల వనరుల సంరక్షణ విధానం సక్రమంగా లేక పోవడం వల్లనే భారత్‌కు నేడు ఈ పరిస్థితి దాపురించిందని శ్రీనివాసన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌తోపాటు భారత్‌ ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు పెరిగినప్పటికీ భారత్‌ మధ్యప్రాంతంలో వర్షాలు 1950 నుంచి తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. అప్పటి నుంచి దేశంలో జల వనరుల సంరక్షణపై భారత్‌ దష్టిని కేంద్రీకరించి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం జల సంరక్షణ దిశగా సరైన చర్యలు తీసుకోక పోయినట్లయితే భవిష్యత్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు