కాందహార్‌ ఘటనను ప్రస్తావించిన సిద్ధూ

18 Feb, 2019 14:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 1999 కాందహార్‌ ఘటనకు బాధ్యులైన వారిని ఎవరు విడుదల చేశారని సిద్ధూ ప్రశ్నించారు. కాందహార్‌ ఘటనకు కారకులైన వారిని విడుదల చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. వారికి వ్యతిరేకంగానే తమ పోరాటమని, అసలు సైనికులు ఎందుకు మరణించాలని ప్రభుత్వ అసమర్ధతను ఎండగట్టారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు అన్వేషించరాదని ఆయన ప్రశ్నించారు.

ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదన్న తన వైఖరికి కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే తరాలకు విఘాతంలా పరిణమించే ఉగ్రవాదాన్ని ఆసాంతం రూపుమాపాలని, ఉగ్ర దాడులకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని సిద్ధూ వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఘటనకు యావత్‌ పాకిస్తాన్‌ను బాధ్యుల్ని చేయలేమని, కొద్ది మంది చేసిన దుశ్చర్యకు మొత్తం దేశాన్నో, ఏ ఒక్కరినో నిందిం‍చలేమని సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే.


సిద్ధూను సస్పెండ్‌ చేయాలి
పాకిస్తాన్‌పై సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేయాలని శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. మరోవైపు పుల్వామా దాడిని ఖండిస్తూ పంజాబ్‌ సీఎం తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆయన మంత్రివర్గ సహచరుడు సిద్ధూ పాకిస్తాన్‌ను ప్రశంసించారని శిరోమణి అకాలీ దళ్‌ నేత బీఎస్‌ మజితీయ ఆరోపించారు.

మరిన్ని వార్తలు