ఆ బాలిక జ్ఞాపకశక్తి అమోఘం

16 Feb, 2016 16:30 IST|Sakshi
ఆ బాలిక జ్ఞాపకశక్తి అమోఘం

మీరట్: ఆమె ఓ ముస్లిం బాలిక. వయసు ఏడేళ్లు కనుచూపు 80శాతం వరకు లేదు. అందువల్ల పెద్దగా పుస్తకాలు చదువలేదు.. బ్రెయిలీ లిపిని కూడా వల్లె వేయలేదు. కానీ, ఆ బాలికకు ఉన్న ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. ఏకంగా భగవద్గీతను తన మనసులో అక్షరం పొల్లు కూడా మర్చిపోలేనంత. ఎవరైనా భగవద్గీత చెప్పమ్మా అని ఇలా అడుగుతుంటారో లేదో వెంటనే తన రెండు చేతులు జోడించి దేవుడిని స్మరిస్తూ టకటకా భగవద్గీత ఆసాంతం వినిపిస్తుంది.

ఇది మీరట్కు చెందిన రిదా జెరా అనే ఏడేళ్ల ముస్లిం బాలిక సాధిచిన ఘనత. పాఠాలు బోధించి, పేజీలపేజీలు బట్టీలు పట్టించినా తెల్లవారే సరికి ఒక పేజీ కూడా గుర్తు పెట్టుకోలేని విద్యార్థులు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భగవద్గీత మొత్తాన్ని కేవలం వినడం ద్వారా పూర్తిగా జ్ఞప్తికి పెట్టుకోవడం సాధారణ విషయమేమి కాదు. ఆమె ఏ మతానికి సంబంధించిన గ్రంథాన్ని చదువుతుందన్నది ప్రస్తుతం ప్రధాన అంశంకాదు కానీ, ఆమెకున్న జ్ఞాపక శక్తి మాత్రమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

జెరా చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఆమె జ్ఞాపక శక్తికి అబ్బురపడి భగవద్గీత మొత్తం ఆమెకు వినిపించగా దాన్ని విని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చక్కగా చెప్తోంది. 'నేను ఖురాన్ చదువుతున్నా, గీత చదువుతున్నా దేవుడిని ప్రార్థిస్తున్నట్లే చదువుతాను. నేను ఏ దేవుడికి ప్రార్థిస్తున్నానన్నది ముఖ్యం కాదు. నేను ఇప్పటి వరకు ఏ దేవుడిని చూడలేదు. ఒక వేళ ఎదురుగా వచ్చినా చూడలేను' అని ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న జెరా చెప్పింది. ప్రస్తుతం ఆమె మీరట్ లోని జాగృతి విహార్లోగల బ్రిజ్ మోహన్ అంధుల పాఠశాలలో చదువుతోంది. 

మరిన్ని వార్తలు