ఢిల్లీలో సిగ్నేచర్‌ బ్రిడ్జి

4 Nov, 2018 04:17 IST|Sakshi

నేడు ప్రారంభించనున్న సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్న యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్‌ బ్రిడ్జిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్‌ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను అనుమతిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు. సిగ్నేచర్‌ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుందని చెప్పారు. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడటం ఒక ప్రత్యేకత కానుందని చెప్పారు. మొత్తం 50 మందిని తీసుకెళ్లే సామర్థ్యమున్న గాజు ఎలివేటర్లు నాలుగింటిని వచ్చే రెండు నెలల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు.

కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం రూ.464 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 2004లో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2010లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు సవరించిన అంచనా రూ.1,131 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2011 నుంచి వంతెన నిర్మాణంలో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. 2015 నాటికి వంతెన నిర్మాణ అంచనా వ్యయం రూ.1,594 కోట్లకు పెరిగిపోయింది. 2018 నవంబర్‌ 4వ తేదీకి ఎట్టకేలకు ‘సిగ్నేచర్‌’ కల నిజమయింది.

మరిన్ని వార్తలు