ఒబామా మెచ్చిన తలపాగా

7 Jun, 2019 03:40 IST|Sakshi

ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జివాన్‌దీప్‌. శాన్‌ డియాగోకు చెందిన ఈయన ఎల్‌జీబీటీక్యూలు జరుపుకునే ప్రైడ్‌  మంత్‌ ఉత్సవాల్లో భాగంగా ధరించిన ఇంద్ర ధనుస్సు రంగుల తలపాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను ముగ్ధుడిని చేసింది.  ప్రైడ్‌ మంత్‌ ఉత్సవాలు ప్రారంభమైన జూన్‌ 1న జివాన్‌దీప్‌ ట్విట్టర్‌లో పెట్టిన ఈ ఫోటోకు లక్షకుపైగా లైకులు 15వేలకు పైగా రీట్వీట్‌లు వచ్చాయి. బైసెక్సువల్‌ అయిన జివాన్‌ ఈ ఫోటోకు ‘బై సెక్సువల్‌ బ్రెయిన్‌ సైంటిస్టయినందుకు గర్వంగా ఉంది. నా గుర్తింపునకు సంబంధించిన అన్ని అంశాలను(తలపాగా, గడ్డం) వ్యక్తీకరించగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే స్వేచ్ఛను ఇతరులు కూడా ప్రదర్శించేలా చూసేందుకు కృషి చేస్తాను’అని కేప్షన్‌ ఇచ్చారు. ఈ ఫోటోకు తాజాగా ఒబామా కూడా లైక్‌ కొట్టారు. ‘జివాన్‌దీప్‌ మీరు గర్వపడే పని చేశారు .

ఈ దేశంలో గేలకు మరింత సమానత్వం కల్పించేందుకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు...అన్నట్టు.. మీ తలపాగా అద్భుతంగా ఉంది. అందరికీ ప్రైడ్‌ మంత్‌ శుభాకాంక్షలు.’అని ఒబామా ట్వీట్‌ చేశారు. జూన్‌ 4న ఒబామా చేసిన ఈ ట్వీట్‌కు 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో  ఎల్‌జీబీటీక్యూలకు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. 1969 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీక్యూ లు ప్రైడ్‌ మంత్‌ జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం అమెరికాలోని గ్రీన్‌విచ్‌ గ్రామంలోని ఒక బారులో గేలు సంబరాలు చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో  దేశ వ్యాప్తంగా గేలు హక్కుల కోసం ఉద్యమించారు.ఫలితంగా ఇతరులతో పాటు సమానంగా హక్కులు సాధించారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతీ జూన్‌లో ఎల్‌జీబీటీక్యూలు ప్రైడ్‌ మంత్‌ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు