వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్లు!

11 Sep, 2018 09:54 IST|Sakshi

దేశంలో ఇటీవలికాలంలో చిత్రవిచిత్ర కారణాలతో వివాహాలు రద్దవుతున్నాయి. అబ్బాయి భయస్తుడనీ, అమ్మాయి సరిగ్గా మాట్లాడటం లేదని సాకులు చెబుతూ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోతున్నారు. తాజాగా వాట్సాప్‌లో నిండా మునిగిపోయిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్‌లో కాబోయే భర్త షాకిచ్చాడు. వాట్సాప్‌లో గంటల తరబడి గడుపుతూ కాబోయే అత్తమామలకు భారీగా సందేశాలు పెట్టడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఆమ్రోహీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆమ్రోహీ జిల్లాలోని నౌగావ్‌సాదత్‌ గ్రామానికి చెందిన ఉరోజ్‌ మెహందీ కుమార్తెకు ఫకీర్‌పురాకు చెందిన ఖమర్‌ హైదర్‌ కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటి నుంచి అమ్మాయి వాట్సాప్‌లో కాబోయే అత్తమామలకు ఇష్టానుసారం సందేశాలు పెట్టడంతో ఈ నెల 5న వివాహ మండపానికి వరుడి కుటుంబ సభ్యలెవరూ రాలేదు. దీంతో అమ్మాయి తండ్రి ఫోన్‌ చేయగా తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వరుడి తండ్రి తెలిపాడు. అమ్మాయి ఎప్పుడూ వాట్సాప్‌లో ఉంటూ సందేశాలు పంపడంతో తమ కుమారుడు ఆమెతో పెళ్లికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశాడు. దీంతో వధువు తండ్రి ఉరోజ్‌ పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబం అడిగిన రూ.65 లక్షల కట్నాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రవిచిత్ర కారణాలతో చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
 
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ వరుడు తాము కోరిన మాంసాహారాన్ని వధువు కుటుంబ సభ్యులు వడ్డించలేదన్న  కోపంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
 
విందులో పెళ్లి కొడుకు సోదరుడికి ఇంకో రసగుల్లా ఇవ్వడానికి వధువు తరఫు బంధువులు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్‌లోనే మరో పెళ్లి ఆగిపోయింది.
 
ఇక యూపీలోని షాజహాన్‌పూర్‌ కు చెందిన ఓ యువతి ఊరేగింపు సందర్భంగా పెళ్లికొడుకు చేసిన నాగిన్‌ డ్యాన్స్‌తో చిరాకుపడి వివాహాన్నే రద్దు చేసుకుంది.
 
బిహార్‌లోని సరన్‌లో మరింత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపుగా వస్తున్న పెళ్లికొడుకు ఉరుము శబ్దానికి అదిరిపడటంతో అంత పిరికివాడిని తాను పెళ్లి చేసుకోలేనని మరో యువతి తేల్చిచెప్పింది. దీంతో పీటల దగ్గరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా