ఆధ్యాత్మిక గురువు వాస్వానీ కన్నుమూత

13 Jul, 2018 03:36 IST|Sakshi
వాస్వానీ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బారులుతీరిన జనం.(ఇన్‌సెట్లో)వాస్వానీ

సామాజిక కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

నేటి సాయంత్రం వాస్వానీ మిషన్‌లో అంత్యక్రియలు

పుణె: వయోభారంతో కొద్ది రోజులుగా ఆశ్రమంలో చికిత్సపొందుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాధు వాస్వానీ మిషన్‌ అధిపతి దాదా జేపీ వాస్వానీ (99) గురువారం తుదిశ్వాస విడిచారు. ‘గత 3 వారాలుగా పుణేలోని ఓ ప్రైవేటు ఆస్పతిలో వాస్వానీ చికిత్స పొందుతున్నారు. గత రాత్రే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఉదయం ఆశ్రమంలో కన్నుమూశారు’ అని మిషన్‌ సభ్యురాలు తెలిపారు.

పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో 1918 ఆగస్టు 2న సింధి కుటుంబంలో వాస్వానీ జన్మించారు. వచ్చే నెలలోనే ఆయన వందో పుట్టిన రోజు కావడంతో మిషన్‌ సభ్యులు భారీగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈలోపే కన్నుమూయడంతో భక్తులు, అభిమానులు శోకసంద్రంలో మునిగారు. వాస్వానీ సామాజిక సేవ, బాలిక విద్య,  జంతు సంరక్షణ లాంటి సేవా కార్యక్రమాల్ని మిషన్‌ ద్వారా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయన భక్తులుగా మారారు.

150కి పైగా పుస్తకాలు..
వాస్వానీ 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రాశారు. వీటిలో ఇంగ్లిష్‌లో 50 పుస్తకాలు రాయగా.. సింధి భాషలో ఎక్కువగా రాశారు. ఆయన రచనలను మరాఠీ, హిందీ, కన్నడ, గుజరాతీ, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్, జర్మనీ, పలు విదేశీ భాషల్లోకి అనువదించారు. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి పలు అవార్డులు, బిరుదులు, సత్కారాలు పొందారు. ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక యూ థాంట్‌ పీస్‌ అవార్డుని 1998లో అందుకున్నారు. గత మేలోనే రాష్ట్రపతి కోవింద్‌ వాస్వానీ మిషన్‌ సందర్శించి అక్కడి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ని ప్రారంభించారు. వాస్వానీ 99వ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ, బాలీవుడ్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ తరచూ వాస్వానీ మిషన్‌ను సందర్శించేవారు.

ప్రముఖుల సంతాపం..
దాదా వాస్వానీ మృతి పట్ల రాష్ట్రపతి  కోవింద్, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ‘వాస్వానీ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సమాజంలోని పేదలు, అభాగ్యుల కోసమే జీవించారు. బాలికలకు విద్యను అందించడం కోసం ఎంతగానో కృషి చేశారు’ అని పేర్కొంటూ ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. ‘దాదా జేపీ వాస్వానీ నన్నెంతో ప్రభావితం చేశారు. 28 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన ప్రపంచ సర్వమత సదస్సులో ఆయనతో కలసి పాల్గొనే అవకాశం దక్కింది. 2013లో వాస్వానీ మిషన్‌ స్థాపించిన నర్సింగ్‌ కళాశాల ప్రారంభించడానికి పుణేకు వెళ్లాను’ అని ఓ ట్వీట్‌లో మోదీ వెల్లడించారు. వాస్వానీ లేని లోటు పూడ్చలేనిదని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపాన్ని తెలిపారు.

నేడు సాయంత్రం అంత్యక్రియలు..
దాదా వాస్వానీ అంత్యక్రియలు శుక్రవారం వాస్వానీ మిషన్‌లోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని వందలాది మంది భక్తులు, అభిమానుల దర్శనార్థం అక్కడే ఉంచారు. అంత్యక్రియలకు బీజేపీ సీనియర్‌ నేత అద్వానీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా