అస్సాం ప్రజలను హోరెత్తిస్తోన్న ‘పాటలు’

17 Dec, 2019 14:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేయడంలో భాగంగా డిసెంబర్‌ 11వ తేదీ నుంచి అస్సాం అంతటా ఇంటర్నెట్‌ సర్వీసులను సంపూర్ణంగా నిలిపివేశారు. అయినప్పటికీ టీవీలే ప్రత్యక్ష ప్రసార సాధనాలుగా ఆందోళనా కార్యక్రమాలు అంతటా యధావిథిగా కొనసాగుతున్నాయి. ఆందోళనలు సాంస్కతిక రూపం దాల్చడంతో మరింత ఆసక్తికరంగా మారాయి. పలు రంగాలకు చెందిన కళాకారులు ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో అవి మరింత రక్తి కడుతున్నాయి.

సంగీత రంగంలో భారత రత్న అందుకున్న ప్రముఖ అస్సాం గాయకుడు భూపేన్‌ హజారికా అంతటి వాడుగా ప్రశంసలు అందుకుంటున్న అస్సాం వర్ధమాన ప్రజా గాయకుడు, గేయ రచయిత జుబీన్‌ గార్గ్‌ అఖిల భారత అస్సాం విద్యార్థుల సంఘంతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు గాయకులు వివాదాస్పద పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా బాణీలు కూర్చి పాటలు పాడుతున్నారు. ఉద్యమానికి ఊపుతెస్తున్నారు. డిసెంబర్‌ 15వ తేదీన ఆదివారం నాడు వేలాది మంది ప్రజలు గౌహతి నడిబొడ్డున ప్రదర్శన జరిపి పాటలు, కవిత్వంతో హోరెత్తించారు. రాష్ట్రానికి చెందిన పలువురు కళాకారులు అస్సాంకు చెందిన ‘ధూల్‌ (డ్రమ్‌), తాలం’తో ప్రజలను ఉర్రూతలూగించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాట రాసిన ప్రముఖ అస్సాం గాయకుడు నీలోత్పాల్‌ బోరా ఈ సందర్భంగా మాట్లాడుతూ పాట పాడుతుంటే ఎవరు హింసాత్మక చర్యలకు పాల్పడరాదని పిలుపునిచ్చారు.



అస్సాం భాషా, సంస్కృతులను పరిరక్షించాల్సిన తాము ఆందోళనలో పాల్గొనడం ఏమిటని ముందుగా తటపటాయించామని, వాటిని పరిరక్షించుకోవడం కోసమే ఈ ఆందోళన అన్నది అర్థం అవడంతో రంగంలోకి దిగామని ప్రముఖ అస్సాం కంపోజర్, గాయకులు మనాస్‌ రోబిన్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల రూపం సంతరించుకోవడంతో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు.  ప్రత్యేక అస్సాం సామాజిక, భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడంలో భాగంగానే అస్సాం ప్రజలు ప్రధానంగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 1971, మార్చి 24వ తేదీ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన అన్ని మతాల వారిని విదేశీయులుగానే పరిగణించాలన్నది వారి డిమాండ్‌. ఈ మేరకు అస్సాం జాతీయ వాదులు 1985లో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఒక్క ముస్లింలు మినహా హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులు అందరకి పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకరావడంతో అస్సాం ప్రజలు ఆందోళన సాగిస్తున్నారు. తమ నాగరికత, సామాజిక, భాషా సంస్కతులను పరిరక్షిస్తామని 1985 ఒప్పందంలోని ఆరవ షెడ్యూల్‌ కింద కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

మరిన్ని వార్తలు