ఉన్నది ఒకటే కిడ్నీ వదల్లేదు చదువుని

3 May, 2019 09:19 IST|Sakshi
ఉత్తీర్ణత సాధించిన సురేష్‌ను అభినందిస్తున్న కుటుంబ సభ్యులు

టెన్త్‌లో 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత  

బళ్లారి బాలుడు సురేష్‌ పట్టుదల  

బళ్లారి, అర్బన్‌:  ఆత్మ విశ్వాసంతో అనారోగ్యాన్ని సైతం అధిగమించి పదో తరగతిలో మెరుగైన ఫలితం సాధించిన అరుదైన విద్యార్థి సురేష్‌ అని అభినందనలు అందుకుంటున్నాడు. బళ్లారి నగరం కొళగల్లు రోడ్డులోని ఇందిరానగర్‌లో నివాసముంటున తాపీ మేస్త్రీ నాగరాజ్, నాగరత్నమ్మల ఏకైక కుమారుడు పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడని తల్లిదండ్రులు సాక్షితో తెలిపారు. గుగ్గరహట్టిలోని ఆదర్శ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న సురేష్‌ అక్టోబర్‌ నుంచి పూర్తిగా అనారోగ్యం బారిన పడడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సురేష్‌కు పుట్టుక నుంచే ఒక మూత్రపిండం లేదని వైద్యులు తేల్చారు. దీంతో మరో కిడ్నీపై అధిక భారం పడటంతో అది కూడా పూర్తి దెబ్బతినిందని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిత్యం ఔషధాలు తీసుకుంటూ విద్యాభ్యాసంపై ఎంతో ఆసక్తి చూపే తమ కుమారుడు మూడు నెలల పాటు స్కూల్‌కు పోయి మరో 6 నెలలు ఇంట్లోనే ఉండి పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 514 మార్కులతో 82.24 శాతం ఉత్తీర్ణత సాధించాడని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారునికి చికిత్స చేయించే స్తోమత తమకు లేదన్నారు. ఇప్పటికే గత అక్టోబర్‌ నుంచి ఇంతవరకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని తెలిపారు.  

సహాయ హస్తం కోసం వినతి
తాను 600 మార్కులు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివానని సురేష్‌ అన్నాడు. ‘పాలిటెక్నిక్‌ చదివి ఇంజనీరింగ్‌ పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నాడు. చదువుతో పాటు రైటింగ్, డ్రాయింగ్, మొబైల్‌ టెక్నాలజీలో చాకచక్యంగా ప్రతిభను చాటుకున్నాడని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగై అందరి  పిల్లల మాదిరిగానే ఆడుకోవాలని భగవంతుని కోరుతున్నామన్నారు. తమ బిడ్డ వైద్యానికి దయగల దాతలు ఆర్థిక సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరారు. వివరాలకు మేస్త్రీ నాగరాజ్‌–9901142959 నంబరులో సంప్రదించాలని తెలిపారు.   

మరిన్ని వార్తలు