సిరివెన్నెలకు పద్మశ్రీ

26 Jan, 2019 04:38 IST|Sakshi
సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ద్రోణవల్లి హారిక, ఎడ్లపల్లి వేంకటేశ్వర రావులకూ దక్కిన పురస్కారం

తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి ఈ అవార్డు

2019 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

నలుగురికి పద్మ విభూషణ్,  14 మందికి పద్మభూషణ్‌

94 మందికి పద్మశ్రీ, వారిలో ఓ ట్రాన్స్‌జెండర్‌ నర్తకి నటరాజ్‌ కూడా

సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్‌ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.

2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది.

వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్‌ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్‌ ఒమర్‌ గులేహ్, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్‌ పురందరేలను పద్మ విభూషణ్‌ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్‌ లాల్‌(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది.

నర్తకి నటరాజ్‌,  ఖాదర్‌ ఖాన్‌


కరియా ముండా,  మోహన్‌లాల్‌

రైతు నేస్తం వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ
వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ లభించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు 1994 నుంచి హైదరాబాద్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నారు. 2001 నుంచి 2004 వరకు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి కలత చెందిన వెంకటేశ్వరరావు రైతు రాజులా బతకటానికి తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా 2005లో రైతునేస్తం మాసపత్రికను ప్రారంభించారు. మొదటి సంచికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2012లో ప«శునేస్తం మాస పత్రికను, ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 2014లో ప్రకృతి నేస్తం మాస పత్రికను ప్రారంభించారు. తన ఆలోచనలను పుస్తక రూపంలో అందిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు  రైతునేస్తం ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కొర్నెపాడు గ్రామంలో రైతునేస్తం ఫౌండేషన్‌ ద్వారా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 వారాలకు పైగా తరగతులను నిర్వహించి 4000 మంది పైచిలుకు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి సూచనల ప్రకారం.. చిరుధాన్యాల సాగుపై రైతునేస్తం తరఫున పుస్తకాలు ప్రచురించారు. వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఆయన స్వగ్రామం కొర్నెపాడులో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవార్డును రైతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. సాక్షి ‘సాగుబడి’ తన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు.

నలుగురికి ‘కీర్తి చక్ర’
దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ను నలుగురు జవాన్లు పొందారు. వీరిలో జాట్‌ రెజిమెంట్‌కు చెందిన మేజర్‌ తుషార్‌ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్‌ విజయ్‌ కుమార్‌(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్‌ పండా, రాజేంద్ర కుమార్‌ నైన్‌ ఉన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ జైల్‌ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ‘పరమ్‌ విశిష్ట సేవా పతకం’ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రావత్‌ సహా 19 మంది సైనికాధికారులకు లభించింది.

ఎమర్జెన్సీపై గొంతెత్తిన నయ్యర్‌
ప్రముఖ జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్త, దౌత్యవేత్త కుల్దీప్‌ నయ్యర్‌ అవిభక్త భారత్‌లోని సియాల్‌ కోట్‌(ప్రస్తుతం పాకిస్తాన్‌)లో 1923, ఆగస్టు 14న జన్మించారు. కెరీర్‌ తొలినాళ్లలో ఉర్దూ పత్రిక అంజామ్‌ లో రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అదే పత్రికలో రిపోర్టర్‌గా చేరారు. దేశవిభజన అనంతరం కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చేశారు. ఆయన ‘ది స్టేట్స్‌మన్‌’ పత్రిక ఢిల్లీ ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి, కేంద్ర మాజీ హోంమంత్రి గోవింద్‌ బల్లప్‌పంత్‌కు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా సేవలందించారు.


1975లో ఎమర్జెన్సీ సందర్భంగా పత్రికలపై సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకించడంతో ఇందిర ప్రభుత్వం ఆయన్ను తీహార్‌ జైలులో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయన్ను లండన్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. కుల్దీప్‌ నయ్యర్‌ 1997లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో రామ్‌నాథ్‌ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బియాండ్‌ ది లైన్స్, ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ, స్కూప్, ఎమర్జెన్సీ కీ ఇన్‌సైడ్‌ స్టోరీ, వాల్‌ ఎట్‌ వాఘా తదితర పుస్తకాలు రాశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన నయ్యర్‌ 2018, ఆగస్టు 23న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.  

పాండవని కళలో ప్రసిద్ధురాలు తీజన్‌
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తీజన్‌ బాయి (62) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన జానపద గాయకురాలు. ఆమెకు 1987లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి. మహాభారతం నుంచి పాండవుల వీరగాథలను ఆమె ఏకకాలంలో సంగీత వాద్యాలను ఉపయోగిస్తూ, జానపద గేయాలు పాడుతూ వివరిస్తారు. దీనినే పాండవని కళ అంటారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎంతో కృషి చేసి ఈ స్థాయికి చేరారు. భిలాయ్‌ పట్టణానికి సమీపంలోని గణియారి గ్రామంలో గిరిజన తెగకు చెందిన చంక్‌లాల్‌ పార్ధి, సుఖవతి దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానంగా తీజన్‌ బాయి జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అప్పటికే ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తికి తీజన్‌ బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతా ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఇక ఆమె అత్తారింటిని వదిలి వచ్చేశారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎంతో కాలం నిలువలేదు. ఛత్తీస్‌గఢ్‌లో లెక్కలేనన్ని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన ఆమె, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, నాటి యూఎస్‌ఎస్‌ఆర్, సైప్రస్, ట్యునీషియా, టర్కీ, మాల్టా తదితర అనేక దేశాల్లోనూ పర్యటించి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఆమె ఎంతో వినమ్రతతో అణుకువగా ఉంటారు.  

ఎదురులేని నేత ఒమర్‌ గులెహ్‌
ఆఫ్రికా దేశమైన జిబౌటీని గత 20 ఏళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న ఇస్మాయిల్‌ ఒమర్‌ గులెహ్‌(72) ఇథియోపియాలో 1947, నవంబర్‌ 27న జన్మించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక జిబౌటీకి వలసవెళ్లారు. ఫ్రెంచ్‌ పాలనలో ఉన్న జిబౌటీలో 1968లో ప్రభుత్వఉద్యోగిగా చేరారు. రెండేళ్లలోనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి ఎదిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ‘జిబౌటీ టుడే’ వార్తాపత్రికను ప్రారంభించారు. 1977లో స్వాతంత్య్రం పొందాక జిబౌటీ తొలి అధ్యక్షుడు, తన బంధువైన హసన్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఏకంగా 22 ఏళ్లు పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న హసన్‌ తన వారసుడిగా గులెహ్‌ పేరును ప్రతిపాదించారు. చైనా ఇప్పటికే జిబౌటీలో నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో భారత్‌ గులెహ్‌కు పద్మవిభూషణ్‌ను ప్రకటించడం గమనార్హం.  

మరాఠా నాటక రచయితకు పద్మవిభూషణ్‌
నాటక–కథా రచయిత, చరిత్రకారుడు బల్వంత్‌ మోరేశ్వర్‌ పురందరే(96) మహారాష్ట్రలోని పుణెలో 1922, జూలై 29న జన్మించారు. ఆయన రచనల్లో 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవితం, పాలన ఆధారంగా రాసినవే ఎక్కువగా ఉన్నాయి. శివాజీ పాలనపై పురందరే రాసిన ‘జనతా రాజా’ అనే నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందింది. చరిత్రపై అమితాసక్తి చూపే పురందరే.. రాజా శివ ఛత్రపతి, కేసరి వంటి పుస్తకాలను రాశారు. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గానూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2007–08 సంవత్సరానికి కాళిదాస్‌ సమ్మాన్‌ అవార్డును ప్రకటించింది. అలాగే 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డును అందించింది.


 

మరిన్ని వార్తలు