నేపాలీలా ఉన్నామంటూ పాస్‌పోర్ట్‌కు నో..

2 Jan, 2020 15:55 IST|Sakshi

అంబాలా : నేపాలీలలాగా ఉన్నామంటూ తనకు, తన సోదరికి పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారని తమకెదురైన అనుభవాలను ఓ యువతి వెల్లడించింది. చండీగఢ్‌లోని పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి తాము వెళ్లిన క్రమంలో అక్కడి అధికారులు తమ ముఖాలను తీక్షణంగా చూస్తూ తాము నేపాలీలమని పత్రాలపై రాశారని, తమ జాతీయత నిరూపించుకునే ఆధారాలు సమర్పించాలని వారు తమను అడిగారని ఆమె తెలిపారు. హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ దృష్టికి తాము ఈ విషయాలను తీసుకువెళ్లిన తర్వాతే తమకు పాస్‌పోర్ట్‌ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు.

తమ కుమార్తెలు సంతోష్‌, హెన్నాలను వెంటబెట్టుకుని భగత్‌ బహదూర్‌ పాస్‌పోర్ట్‌ కోసం చండీగఢ్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లగా దరఖాస్తుదారులు నేపాలీలుగా కనిపిస్తున్నారని వారి డాక్యుమెంట్లపై రాసిన అధికారులు వారికి పాస్‌పోర్టును నిరాకరించారని అంబాలా డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ శర్మ తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే అధికారులతో మాట్లాడానని, అప్పుడు అక్కాచెల్లెళ్లను పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి పిలిపించి వారికి పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. త్వరలోనే వారికి పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు