రేప్ చేస్తారన్న భయంతో...

3 Sep, 2015 00:09 IST|Sakshi
రేప్ చేస్తారన్న భయంతో...

న్యూఢిల్లీ: ''ప్రేమే నేరమా ? మా అన్న, అగ్రవర్ణ యువతి ప్రేమించుకోవడం పాపమా ? అందుకు మేము బలి పశువులం అవుతున్నాం. 15 ఏళ్ల చెల్లిని, నన్నూ రేప్ చేయాల్సిందిగా మా ఊర్లో ఖాప్ పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఊరికి దూరంగా దిక్కులేని వాళ్లుగా మేమూ, మా కుటుంబం బతుకుతోంది. ప్రేమించిన పాపానికి.... మా అన్న చేయని నేరానికి అరెస్టై జైల్లో బతుకుతున్నాడు. మేము ఊరెళ్లాలంటే ఎక్కడ రేప్ చేస్తారేమోనని అణుక్షణం భయంతో చస్తున్నాం. ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయం మమ్మల్ని వెంటాడుతోంది. ఊరికెళితే మాకు రక్షణ లేదు. రేప్ చేసే మూకలు మా కోసం కాచుకు కూర్చున్నాయి. వారి కంటపడితే ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేస్తారు. వారి కట్టుబాటు, సంస్కారం అలాంటిది. ఇక్కడ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల్లా గుట్టు చప్పుడు కాకుండా ఎంతకాలం బతకాలి, ఎలా బతకాలి?


 మా పరిస్థితి, మా నరక యాతన గురించి ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి, మానవ హక్కుల కమిషన్‌కు, షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు లేఖలు రాశాం. ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు రక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. కేసు విచారణలో ఉంది'' అని 23 ఏళ్ల మీనాక్షి కుమారి  తన గోడును మీడియా ముందు వెల్లబోసుకుంది.


ఆమెది దళిత కుటుంబం. వారిది ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామం. ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామంలో జాట్‌లు ఏడువేల మంది ఉండగా, దళితులు 250 మంది ఉన్నారు. మీనాక్షి అన్న 25 ఏళ్ల రవి కుమార్ రెండేళ్ల క్రితం జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల కృష్ణ గాఢంగా ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటే జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన రవి కుమార్ కుటుంబం అందుకు వారించింది. వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన రవి కుమార్ వేరే పెళ్లి చేసుకోవాల్సింది తాను ప్రేమించిన యువతి కృష్ణకు నచ్చచెప్పాడు. వారి ఇంట్లో వాళ్లు కూడా ఆమెను తీవ్రంగా హింసించారు. దాంతో ఆమె హర్యానా రాష్ట్రానికి చెందిన వారి కులస్థుడినే పెళ్లి చేసుకొంది. అతనితో కాపురం చేయలేక కొంతకాలానికి ఊరికి పారిపోయి వచ్చింది. పాత ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.


 ఇది తెలిసిన జాట్ కులస్థులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసుల చేత రవి కుమార్‌ను కొట్టించారు. మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మీరట్ జైలుకు పంపించారు. ఊరిలో ఖాప్ పంచాయతీ సమావేశమై రవి కుమార్ ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాలని, వారి మొఖాలకు మసిపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పింది. అదృష్టవశాత్తు అదే సమయంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు మీనాక్షి కుటుంబ సభ్యులందరూ ఢిల్లీకి వచ్చి ఇక్కడే ఉన్నారు. మీనాక్షి పెద్దన్నయ్య సుమిత్ కుమార్ ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఊరి నుంచి పొరుగింటి వారు ఫోన్ చేసి ఖాప్ పంచాయతీ తీర్మానం గురించి తెలిపారు. ఊరికి రావద్దని సలహా ఇచ్చారు.

దాంతో సుమిత్ కుమార్ ఢిల్లీ శివారులో ఓ గుర్తు తెలియనిచోట కుటుంబ సభ్యులను ఉంచారు. మే నెలలో అరెస్టైన రవి కుమార్‌కు జూన్ 26వ తేదీన బెయిల్ వచ్చింది. బయటకు వస్తే ప్రాణాపాయం ఉండడంతో రవి కుమార్ బెయిల్‌పై విడుదల కాకుండా మీరట్ జైల్లోనే ఉంటున్నాడు. మీనాక్షి కుటుంబం రక్షణ కోసం న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీం కోర్టులో కేసు వాదిస్తున్నారు. ఖాప్ పంచాయతీలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ వాటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. రవికుమార్‌పై మోపిన అభియోగాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, అన్యాయంగా వ్యవహరించిన గ్రామ పెద్దలపై, యూపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని తాను కోరుతున్నానని చెప్పారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సుప్రీం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు