గిరీష్‌ కర్నాడ్‌కు భద్రత పెంపు..

19 Jun, 2018 11:12 IST|Sakshi
ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : హిందూ అతివాద సంస్థల హిట్‌ లిస్ట్‌లో ఉన్న ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌, హేతువాదులు కేఎస్‌ భగవాన్‌, నరేంద్ర నాయక్‌, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీలకు భద్రత కల్పించాలని జర్నలిస్ట్‌ గౌరీలంకేష్‌ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ నలుగురికి గన్‌మెన్లను కేటాయించడంతో పాటు వారి ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హోంశాఖకు రాసిన లేఖలో సిట్‌ కోరింది. హై స్టోరేజ్‌ సామర్థ్యంతో సీసీటీవీ యూనిట్లను నెలకొల్పాలని, కనీసం ఏడాది పాటు ఫుటేజ్‌ను స్టోర్‌ చేసే వెసులుబాటు ఉండాలని కోరింది.

హిందూ సంస్థల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న ఈ నలుగురి కదలికలను, కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సిట్‌ అధికారులు సూచించారు. కాగా జర్నలిస్ట్‌ గౌరీలంకేష్‌ హత్య కేసులో ఘూటర్‌గా అనుమానిస్తున్న వ్యక్తితో సహా ఆరుగురు నిందితులను సిట్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

గౌరీ లంకేష్‌ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారితో పాటు షూటర్‌ పరశురామ్‌ వాగ్మోర్‌కు ఆయుధాన్ని అందించిన వారి కోసం గాలిస్తున్నామని సిట్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు