హిందూ రాష్ట్ర అభివృద్ధి శాఖగా మార్చనీయకండి

26 Mar, 2016 04:36 IST|Sakshi
హిందూ రాష్ట్ర అభివృద్ధి శాఖగా మార్చనీయకండి

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీతారాం ఏచూరి విజ్ఞప్తి

 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్‌ఆర్డీ) శాఖను హిందూ రాష్ట్ర డెవలప్‌మెంట్ మినిస్ట్రీగా మార్చకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించింది. ‘సెంట్రల్ వర్శిటీకి మీరు విజిటర్‌గా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వీసీ నియామకంపై వివాదం నడుస్తోంది.

రోహిత్ ఆత్మహత్య తర్వాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 22న మళ్లీ వర్శిటీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోగానే విద్యార్థులపై లాఠీ దాడి మీకు తెలిసే ఉంటుంది. ఈ వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వసతి గృహాలకు నల్లా కనెక్షన్లను తొలగించారు. హాస్టల్ మెస్‌కు ఆహార సరఫరా నిలిపివేశారు. పోలీసు చర్యపై ఈ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదిగా పేర్కొంది. హెచ్చార్డీ మీవైపు మాకు దారి చూపించింది. అందువల్ల మీరు తక్షణం జోక్యం చేసుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడగలరు’ అని కోరారు.

మరిన్ని వార్తలు