శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఏచూరి నిర్భందం

9 Aug, 2019 15:54 IST|Sakshi

శ్రీనగర్‌ : సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరిని శ్రీన‌గ‌ర్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్‌లో ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే మొహ‌మ్మద్‌ యూసిఫ్ త‌రిగామితో పాటు ఇత‌ర కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న క‌లుసుకునేందుకు వెళ్లారు. కానీ పోలీసులు ఏచూరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. ఏచూరితో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కూడా నిర్భందించారు. ఈ ఘటనపై సీపీఎం పార్టీ తీవ్ర ఆగ్రహం​ వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న మా పార్టీనాయకులను కలవకుండా ఇలా ఏచూరిని విమానాశ్రయంలోనే నిర్భందించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఒక ప్రకటనలో తెలిపింది.

విమానం ఎక్కే ముందే నేను జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ను పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరానని ఏచూరి ట్వీట్‌ చేశారు. ‘మమ్మల్ని ఏయిర్‌పోర్ట్‌ దాటి బయటకు వెళ్లనివ్వలేదని, భద్రతాకారణాల రిత్యా అనుమతి ఇవ్వడం కుదరదంటూ పోలీసులు అడ్డుకున్నారని’ తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు ఆపి వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు