ఎక్కువ గంటలు కూర్చుంటే గుండెపోటు!

21 Dec, 2018 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మీరు ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే మీరు వెంటనే లేచి నిలబడి ఈ వార్తను చదవాల్సిందే. మీరు ప్రతి రోజు శారీరక వ్యాయామం చేస్తున్నా సరే ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తే లేదా ఏ పనిచేయకుండా బడలికగా విశ్రాంతి తీసుకుంటే అది అకాల మరణానికి దారితీయడమే కాదు, చంపేస్తుందట. రోజుకు 60 నిమిషాల నుంచి 75 నిమిషాల వరకు వ్యాయామం చేస్తున్న వారు కూడా రోజుకు సరాసరి 12.30 గంటలపాటు పెద్దగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని పనిచేస్తే  లేదా ఇందులో కొన్ని గంటలు పనిచేసి, మరికొన్ని గంటలు బడలికగా విశ్రాంతి తీసుకున్నా ప్రమాదమేనట. వీరంతా గుండె జబ్బులతో అకాలంగా మరణిస్తారట.

ఈ ప్రమాదం లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషులకు, వయో భేదం లేకుండా పిల్లలు, యువకులు, వృద్ధులకు పొంచి ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 45 ఏళ్లు దాటిన అన్ని వయస్కుల వారిని ఎనిమిదివేల మందిని ఎంపిక చేసి వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగేళ్లపాటు క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత వారు శారీరక శ్రమ అవసరం, ప్రాధాన్యత గురించి ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్యన వచ్చిన ముఖ్యమైన 36 వ్యాసాలలోని అంశాలతో తమ అధ్యయనం వివరాలను పోల్చి చూశారు. తద్వారా తమ అధ్యయనం వివరాలు వాస్తవమేనని తేల్చుకున్నారు. 45 ఏళ్లు దాటిన వారిలోనే సరైన శారీరక శ్రమలేక గుండెపోట్లు వస్తాయని భావించి ఆపై వయస్సు వారిపైనే వారు అధ్యయనం జరిపారు. శారీరక శ్రమ లేకపోతే పిల్లలకు కూడా ప్రమాదమేనని వారు ఆస్ట్రేలియా వ్యాసాల ద్వారా తెలుసుకున్నారు.

రోజుకు 24 గంటల సమయం కనుక, అందులో సగకన్నా ఎక్కువ కాలం శారీరక శ్రమ ఉండాలని అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. అధ్యయనంలో పాల్గొన్న ఎనిమిది వేల మందిలో వారి శారీరక శ్రమను కొలవడానికి ‘యాక్సిలెరోమీటర్లు’ ఉపయోగించారు. ప్రస్తుతం బ్రిటన్‌ అమలు చేస్తున్న ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరు వారానికి 150 నిమిషాలు, అంటే రోజుకు 30 నిమిషాల చొప్పున ఐదు రోజులపాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నాయి. అయితే వారానికి 300 నిమిషాలు అంటే రోజుకు గంట చొప్పున 5 రోజులు శారీరక శ్రమ చేసినా సరిపోదని ఆస్ట్రేలియా వ్యాసాలు సూచిస్తున్నాయి. అందుకనే అమెరికా అధ్యయనకారులు రోజుకు 12.30 గంటలపాటు శారీరక శ్రమ ఉండాలంటున్నారు. శారీరక శ్రమంటే ఇక్కడ వ్యాయామమే కాదు.

శారీరక కదలికలు. పనిచేసే చోట ఆఫీసయినా, ఇళ్లయినా అదే పనిగా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, నడవడం, పచార్లు కొట్టడం లాంటివి చేయాలి. మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం, ఆఫీసులో నలుగురితోనో, పది మందితోనే మీటింగ్‌ ఉంటే కూర్చొని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది. సమీపంలో వున్న అనుబంధ ఆఫీసుకో, మిత్రుడికో మెయిల్‌ పంపించకుండా స్వయంగా వెళ్లి సమాచారం అందించడం లాంటివి చేయాలి. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే వీలైనంత దూరంలో ఉన్న హోటల్‌కో, మెస్‌కో వెళ్లాలి. భోజనం తెచ్చుకుంటే అనంతరం కాస్త దూరం నడవాలి. ఇంట్లో మంచాలపై, సోఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపై కూర్చోవాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు