ఇస్రో చైర్మన్‌గా శివన్‌

11 Jan, 2018 01:28 IST|Sakshi

19న బాధ్యతల స్వీకరణ

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.శివన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ శివన్‌ను ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్‌ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ పదవీకాలం జనవరి 18తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న శివన్‌ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్య తలు స్వీకరించనున్నారు.

మూడేళ్లపాటు శివన్‌ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ఇస్రో తన 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో శివన్‌ నియామక ప్రకటన వెలువడటం గమనార్హం. మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పొందిన శివన్‌..బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)లో మాస్టర్స్‌ చేశారు.

ఇస్రో 1982లో చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) ప్రాజెక్టుతో శివన్‌ కెరీర్‌ ప్రారంభమైంది. భారత జాతీయ ఇంజనీరింగ్‌ అకాడమీతో పాటు ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, సిస్టమ్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాలో శివన్‌ సభ్యుడిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు