హోటల్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్వాధీనం

7 May, 2019 10:43 IST|Sakshi

పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్‌లో సోమవారం ఉదయం ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ముజఫర్‌పూర్‌ ఎస్‌డీఓ కుందన్‌ కుమార్‌ ఈవీఎంలను సీజ్‌ చేసి తన స్వాధీనంలోకి తీసుకున్నారు. సెక్టార్‌ మేజిస్ర్టేట్‌ అవధేష్‌ కుమార్‌ తన డ్రైవర్‌ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఈవీఎంలను హోటల్‌కు తీసుకువెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈవీఎంలను హోటల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం తెలియగానే అక్కడ గుమికూడిన స్ధానికులు మేజిస్ర్టేట్‌ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపారు.

పోలింగ్‌ విధుల్లో నిర్లక్ష్యం​ ప్రదర్శించారని మేజిస్ర్టేట్‌ అవధేష్‌ కుమార్‌కు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈవీఎంలు హోటల్‌కు ఎలా చేరుకున్నాయో వెల్లడించాలని ఆయనను కోరారు. తన డ్రైవర్‌ ఓటు వేసేందుకు వెళ్లడంతో మేజిస్ర్టేట్‌ ఈవీఎంలు, వీవీప్యాట్‌ను హోటల్‌కు తీసుకువెళ్లారని జిల్లా కలెక్టర్‌ అలోక్‌ రంజన్‌ ఘోష్‌ నిర్ధారించారు. నిబంధనలను ఉల్లంఘించిన అవధేష్‌ కుమార్‌పై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు