బంఫర్‌ లాటరీలో జాక్‌పాట్‌ కొట్టారు

21 Sep, 2019 09:10 IST|Sakshi

తిరువనంతపురం: కేరళకు చెందిన ఆరుగురు సేల్స్‌మెన్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. కొల్లాం జిల్లాలోని ఓ నగల దుకాణంలో రాజీవన్, రామ్‌జిమ్, రోనీ, వివేక్, సుబిన్ థామస్‌, రతీష్‌లు కేరళ లాటరీ విభాగం విడుదలచేసిన టికెట్‌ కొన్నారు. తాజా లాటరీ ఫలితాల్లో వీరుకొన్న టికెట్‌కు మొదటి బహుమతి కింద ఏకంగా రూ.12 కోట్లు వచ్చాయి. ఇందులో పన్నులు, ఇతర కత్తింపులు పోనూ ఆరుగురు విజేతలకు రూ.7.56 కోట్లు దక్కనున్నాయి.

‘మేమంతా తలో కొంత డబ్బు వేసుకుని గతంలో లాటరీ టిక్కెట్లు కొన్నాం. ఈసారి కూడా అలాగే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశామ’ని వివేక్‌ తెలిపారు. ‘లాటరీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెల్చుకోవడాన్ని మొదట నమ్మలేకపోయాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నామ’ని సుబిన్‌ థామస్‌ అన్నారు. తలో 50 రూపాయలు వేసుకుని 300 రూపాయల లాటరీ టిక్కెట్‌ కొన్నట్టు చెప్పారు. తమ దగ్గరున్న టిక్కెట్‌కే బంఫర్‌ డ్రా తగిలిందని తెలిపారు. రెండో ప్రైజ్‌ రూ. 5 కోట్లు(50 లక్షల చొప్పున 10 మందికి), మూడో ప్రైజ్‌ 2 కోట్లు (10 లక్షల చొప్పున 20మందికి), నాలుగో ప్రైజ్‌ రూ. కోటి రూపాయలు అని వెల్లడించారు.

తిరువోనం బంఫర్‌గా పిలిచే ఈ లాటరీ కేరళలో చాలా పాపులర్‌. గురువారం లాటరీ తీసే సమయానికి 46 లక్షల టిక్కట్లగానూ దాదాపు 43 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ విజేతలను ప్రకటించారు. ఆరుగురు సేల్స్‌మెన్లు కొన్న టిమ్‌-160869 టిక్కెట్‌కు బంఫర్‌ లాటరీ తగిలింది. టిక్కెట్‌ అమ్మకాలపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఓనమ్‌, దసరా, కిస్మస్‌ పండుగల సందర్భంగా కేరళలో భారీగా లాటరీలు నిర్వహిస్తుంటారు.

మరిన్ని వార్తలు