హైట్ కోసం ఆపరేషన్ చేయించుకుంటే..

17 Aug, 2015 13:06 IST|Sakshi
హైట్ కోసం ఆపరేషన్ చేయించుకుంటే..

ముంబై: ఎలాగైనా పొడవు పెరగాలని ఓ17  ఏళ్ల కుర్రాడు  కలలు కన్నాడు.  కానీ ఆ ప్రయత్నమే  పీడకలగా మిగిలిపోతుందని అతడు ఊహించలేదు.  అడుగు తీసి అడుగు వేయాలంటేనే నరకాన్ని అనుభవిస్తున్నాడు.  చివరికి అవిటివాడుగా మారిన వైనం ముంబైలో చోటు చేసుకుంది.   

 

వివరాల్లోకి  వెళితే 5 అడుగుల పొడవున్న  ప్రేమ పటేల్  ఇంకొంచెం ఎత్తు పెరిగితే బావుండునని ఆశించాడు.  చుట్టుపక్కల వాళ్లు,  స్నేహితులు ...అతడిని మరగుజ్జు  అని గేలి చేస్తోంటో ఎలాగైనా  పొడవు పెరగాలని అనుకున్నాడు.  అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి డాక్టర్లను  సంప్రదించారు. ఆటో నడుపుకొని జీవనం సాగించే ఆ కుటుంబం అతని కోరికను కాదనలేకపోయింది.  స్థానిక వైద్యుణ్ని సంప్రదించారు.  అతను సియాన్ ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు.

అక్కడ ప్రేమ్ పటేల్ను పరీక్షించిన వైద్యులు  జెనెటిక్ డిజార్డర్ అని,  ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఆపరేషన్ చేస్తే ఎముకలు సాగుతాయనీ, పొడవు  పెరుగుతుందనీ హామీ యిచ్చారు.  అలా  జూన్ 25, 2013న ప్రేమ్ పటేల్కు  మొదటి ఆపరేషన్ జరిగింది.  ఇక అంతే ఆ రోజు నుంచి అతనికి నరకం కనిపించడం మొదలైంది. దాదాపు నెలరోజుల పాటు మంచానికే పరిమితమ్యాడు. మెల్లిగా అడుగులు వేయగలిగాడు. అయితే భరించలేని నొప్పి. మళ్లీ ఆసుపత్రికి పరుగు దీశాడు.

నొప్పి తగ్గాలంటే మళ్లీ ఆపరేషన్  చేయాలని డాక్టర్లు తేల్చారు. అలా 2014 డిసెంబర్ దాకా మొత్తం ఆరు ఆపరేషన్లు నిర్వహించారు. అయినా ఫలితం శూన్యం.  కాలు కదిపితే నరకం.. అడుగు తీసి అడుగు వేయాలంటే భరించలేని నొప్పి.  ఎడమ కాలుకు పూర్తిగా పాడయ్యింది.
పొడవు పెరగాలని అనుకున్నానే తప్ప ఇంత నరకం అనుభవించాల్సి వస్తుందని  అనుకోలేదని  ప్రేమ్ వాపోతున్నాడు.  మందుల ద్వారా పొడవు పెరగొచ్చని స్నేహితులు చెపితే నమ్మానని, చివరికి ఇలా మిగిలానంటూ అచేతనంగా  మారిపోయిన తన కాళ్లను చూసుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మరోవైపు నిరుపేదలమైన తాము మూడులక్షలు ఖర్చు చేసి వైద్యం  చేయిస్తే   చివరికి తన  కొడుకు అవిటివాడుగా మారిపోయాడని ప్రేమ్ పటేల్ తల్లి మీనా వాపోతోంది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్ బినెత్ సేత్ మాత్రం బాధితుల  విమర్శలను ఖండిస్తున్నారు.  జెనిటిక్ బోన్ డిజార్డర్ తో బాధ పడుతున్నాడని, దానికి చికిత్స చేశామన్నారు. తాము చెప్పిన సలహాలను, జాగ్రత్తలను పాటించలేదని ఆరోపిస్తున్నారు.  అందుకే ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్నారు.  

అయితే  వైద్యుల వాదనను సామాజిక కార్యకర్త సంతోష్ ఖారత్  కొట్టివేస్తున్నారు.   డాక్టర్ల అత్యాశ, నిర్లక్ష్యం ప్రేమ్ పటేల్ ప్రాణాల మీదికి తెచ్చిందని విమర్శిస్తున్నారు. అతని కాళ్లతో ప్రయోగాలు చేశారని,  పరిస్థితి విషమించడంతో  చేతులెత్తేసారని మండిపడుతున్నారు.  దీనిపై బాధితుని తరపున న్యాయపోరాటానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు.  సంబంధిత పోలీస్ స్టేషన్లో  కేసు నమోదు చేశామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు