క‌మ్యునిటీ ట్రాన్స్‌మిష‌న్ ద్వారా కరోనా

4 Apr, 2020 20:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో క‌రోనా పాజిటివ్‌ కేసులు మ‌హారాష్ట్రలో ఎక్కువ‌గా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆరు నెల‌ల చిన్నారి కూడా ఈ వైర‌స్ బారిన ప‌డింది.  గురువారం క‌ళ్యాణ్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల ఓ వ్య‌క్తి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేర‌గా, కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. దీంతో మిగ‌తా కుటుంబ‌ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కి త‌ర‌లించారు. మ‌రుస‌టి రోజు ఆ కుటుంబంలోని ఆరు నెల‌ల చిన్నారి తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతుండ‌టంతో స్థానికంగా ఓ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. అక్క‌డ ఏ మాత్రం సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో చిన్నారిని ఎస్సార్‌సీసీ హాస్పిట‌ల్‌కి తీసుకెళ్ల‌గా క‌రోనా రోగుల‌ను చేర్చుకోమంటూ తెగేసి చెప్ప‌డంతో ఓ వైద్యుడి రిఫ‌రెన్స్‌పై కస్తుర్భా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించి, శ‌రీరం కూడా నీలం రంగులోకి మారింది. కానీ అక్క‌డి వైద్యులు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. స‌మాచారం అందుకున్న మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జోక్యంతో వైద్యులు వెంట‌నే చికిత్స ప్రారంభించారు. శ‌నివారం నిర్వ‌హించిన కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్ అని తేలింది. అయితే కుటుంబ స‌భ్యులెవ‌రూ గ‌తంలోనూ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌లేదు. క‌మ్యునిటీ ట్రాన్స్‌మిష‌న్ ద్వారా ఆ కుటుంబానికి వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం వారు నివాస‌ముంటున్న క‌ళ్యాణ్‌, డొంబివ‌ల్లి ప్రాంతాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

మరిన్ని వార్తలు