ఆరుగురు సుప్రీం జడ్జిలకు స్వైన్‌ ఫ్లూ

25 Feb, 2020 12:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్‌ ఫ్లూ కేసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆందోళన రేపుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక మైన హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ప్లూ) వైరస్‌ సోకింది. దీంతో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్వైన్‌ ప్లూ వ్యాప్తి చెందుతున్న వైనంపై సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కోరామని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో పనిచేసే వ్యక్తులపై టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని  కోరినట్లు చెప్పారు. 

అలాగే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్‌తో కూడా సమావేశమయ్యారు. అనంతరం దేవ్‌ మాట్లాడాతూ వైరస్‌ వ్యాప్తిపై బాబ్డే చాలా ఆందోళన వ్యక్తం చేశారని,  టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారన్నారు. కాగా కశ్మీర్‌, బెంగళూరు నగరాల్లో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు గాకా, తాజా కేసులతో ఈ వైరస్‌ ఢిల్లీ నగరానికి కూడా విస్తరించింది. బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ తన ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యాలయాలను (శుభ్రపరిచేందుకు)మూసివేసింది. ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు